డీటీడీఓగా నాగసాగర్
ఏటూరునాగారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా డీటీడీఓగా గొట్టిముక్కుల నాగసాగర్‌కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో హనుమకొండ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న నాగసాగర్‌కు డీటీడీఓగా బాధ్యతలు అప్పగించారు. ఆయన నేడు (శుక్రవారం) విధుల్లో చేరనున్నారు.
హత్యాయత్నం కేసులో ఐదేళ్లు జైలు
కాటారం(మహాముత్తారం): మహాముత్తారం మండలంలో జరిగిన హత్యాయత్నం కేసులో డొంగిరి వంశీకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5వేలు జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా అసిస్టెంట్ సెషన్ జడ్జి నాగరాజు గురువారం తీర్పు వెల్లడించారు. మహాముత్తారం ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం యామన్‌పల్లి గ్రామానికి చెందిన అట్టెం దేవేందర్‌పై ఏప్రిల్ 25, 2021న వెల్డింగ్ షాప్ వద్ద వంశీ ఇనుపరాడుతో దాడిచేశాడు. దేవేందర్ తీవ్రగాయాలపాలవగా ఆయన చెల్లి అట్టెం దేవిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఎస్సై శ్రీనివాస్ హత్యాయత్నం కేసు నమోదు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా గురువారం ప్రభుత్వం తరఫున అడిషనల్ పీపీ రఫిక్ వాదనలు వినిపించారు. సాక్షాధారాలు పరిశీలించగా నేరం రుజువు కావడంతో నిందితుడు వంశీకి ఐదు సంవత్సరాల జైలు శిక్ష, రూ.ఐదు వేలు జరిమానా విధించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు నిందితుడిని చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడికి శిక్ష పడటంలో ప్రతిభ కనబర్చిన అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
కుటుంబ నియంత్రణ
ప్రతీ ఒక్కరి బాధ్యత
భూపాలపల్లి అర్బన్: కుటుంబ నియంత్రణ ప్రతీ ఒక్కరి బాధ్యతని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిర్వహిస్తున్న కుటుంబ నియంత్రణ చికిత్స శిబిరాన్ని గురువారం డీఎంహెచ్‌ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురుషులకు కోత కుట్టులేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. శిబిరాన్ని పురుషులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆపరేషన్ తర్వాత ఎలాంటి సమస్యలు ఉండవని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్ ప్రోగ్రాం అధికారిని డాక్టర్ శ్రీదేవి, డెమో శ్రీదేవి, టెక్నికల్ సిబ్బంది పాల్గొన్నారు.
హోంగార్డ్ రైజింగ్‌డే
వేడుకలు
భూపాలపల్లి అర్బన్: హోంగార్డ్ రైజింగ్ డే వేడుకలను జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్పీ సంకీర్త్ హాజరై వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. హోంగార్డ్‌లకు వాలీబాల్ క్రీడలను ప్రారంభించారు. అనంతరం ఎస్పీ మాట్లాడారు.
డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలి
జిల్లాలో చలితీవ్రత పెరిగిన నేపథ్యంలో పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాల డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సంకీర్త్ ప్రకటనలో సూచించారు. చలికాలం రోడ్డు భద్రత ప్రతి డ్రైవర్ బాధ్యతన్నారు. పోలీసుల సూచనలు పాటిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చన్నారు.
డీటీడీఓగా నాగసాగర్


