ఏటా నష్టమే..
కాళేశ్వరం: ఓ వైపు రైతులు తమ పత్తి పంటకు తెగుళ్లు సోకి పలు పురుగుల మందులను వేసి పంటను కాపాడుకున్నారు. మరో వైపున పత్తి కాత, పూత దశకు రావడంతో అడవి పందులు, కోతులు ఆశించడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో పంటలను రాత్రి వేళల్లో ధ్వంసం చేస్తుండడంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా మారింది. రూ.లక్షల్లో పెట్టుబడికి ఖర్చు చేసి నిండా మునుగుతున్నామని, సంబంధిత అటవీశాఖ నుంచి రక్షణ చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
పత్తి పంటకు దెబ్బ..
జిల్లాలో 98,780 ఎకరాల్లో పత్తిపంటను రైతులు సాగు చేస్తున్నారు. ఎకరానికి రూ.30వేల వరకు పెట్టుబడి పెట్టారు. అడవి పందులు, కోతులు పత్తిపంటను నాశనం చేస్తున్నాయి. కాయ దశలో పత్తి చేనులోకి చొరబడి పంటను ధ్వంసం చేస్తున్నాయి. దీంతో రైతులు పంటను వదిలేసుకుంటున్నారు. అటవీశాఖ అధికారులు మాత్రం రక్షణ చర్యలు తీసుకోవడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఇటీవల మహదేవపూర్ మండలం అన్నారం గ్రామంలో ఆకుదారి రాజయ్య నాలుగు ఎకరాల్లో పత్తి పంటను సాగుచేసి పందులు, కోతులు పూర్తిగా తొక్కి ధ్వంసం చేయడంతో మేకలు, గొర్రెలు తోలుకు వచ్చి మేతకు వదిలేశాడు. దీంతో కోలుకోలేని విధంగా రైతుకు నష్టం వాటిల్లింది. మద్దులపల్లికి చెందిన పోతుల తిరుపతి ఐదెకరాల్లో పత్తిపంటను వేయగా.. రెండెకరాల వరకు పందులు, కోతులు తొక్కి ధ్వంసం చేశాయి. ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు.
అంతకుముందు తెగుళ్లతో ఇబ్బంది
రూ.లక్షల్లో పెట్టుబడి ఖర్చులు
పట్టించుకోని సంబంధిత అధికారులు
ఏటా నష్టమే..


