ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి
చిట్యాల: ఏపీఎంతో మాట్లాడుతున్న కలెక్టర్, భూపాలపల్లి అర్బన్: నిర్మాణాలను పరిశీలిస్తున్న విజయలక్ష్మి
చిట్యాల: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు పూర్తిచేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం మండలంలోని ముచినిపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో 45 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటివరకు 25 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, పెండింగ్‌లో ఉన్న ఇళ్ల నిర్మాణాలు త్వరగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని గృహనిర్మాణ శాఖ అధికారులకు ఆదేశించారు. ఇళ్ల నిర్మాణానికి స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందజేయాలని ఏపీఎంకు సూచించారు. మహిళా సంఘాల ద్వారా రుణాలు, తదితర అంశాలపై గృహ నిర్మాణ శాఖ, డీఆర్‌డీఓ, ఎంపీడీఓలతో రెండు రోజులలో సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ పీడీ లోకిలాల్, తహసీల్దార్ షేక్ ఇమామ్‌బాబా, ఎంపీడీఓ జయశ్రీ, ఏపీఏం రాజేందర్, ఆర్‌ఐ రాజేందర్, తదితరులు పాల్గొన్నారు.
పనుల్లో వేగం పెంచాలి
రేగొండ: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. మండలంలోని లింగాల గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను, పాఠశాల, నర్సరీ, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో పాఠాలు చదివించారు. విలువలతో కూడిన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ లోకిలాల్, డీఈ శ్రీకాంత్, తహసీల్దార్ శ్వేత, ఎంపీడీఓ వెంవటేశ్వరరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన
భూపాలపల్లి అర్బన్: మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను గురువారం మున్సిపాలిటీ స్పెషల్ అధికారి, ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ విజయలక్ష్మి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. లబ్ధిదారులు ప్రభుత్వం సూచించిన విధంగా ఇంటి నిర్మాణాలు చేపట్టాలన్నారు. ఇంటి నిర్మాణం పూర్తిచేసిన వెంటనే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఇంటి నిర్మాణంలో అలసత్వం వహించవద్దన్నారు. అధికారుల నుంచి తగు సూచనలు, సలహాలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, టీపీఓ సునీల్, వార్డు అధికారులు, జవాన్లు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ
ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి


