
మెరుగైన పాలన అందించడమే లక్ష్యం
భూపాలపల్లి: ప్రజలకు మెరుగైన పాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పని చేస్తుందని ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం అన్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్ష పదవి ఎన్నిక కోసం జిల్లాలోని పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. డీసీసీ అధ్యక్ష పీఠం ఆశిస్తున్న వారి గురించి అభిప్రాయాలు సేకరించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాన్సన్ అబ్రహం మాట్లాడుతూ.. సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమ లక్ష్యం కాంగ్రెస్ కమిటీలను బలోపేతం చేయడమేనన్నారు. అన్ని వర్గాలకు నాయకత్వ అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తమ పార్టీ పని చేస్తుందని తెలిపారు. ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగిన నాయకుడినే జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకుంటామని వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ.. రాహుల్‌గాంధీకి రెండు పర్యాయాలు పీఎంగా అవకాశం వచ్చినా, పదవిని వదిలేసి ఆ స్థానంలో సుముచితులైన వారికి కూర్చోబెట్టారన్నారు. 2029లో దోపిడీ దొంగల నుంచి ఈ దేశానికి విముక్తి కలిగేలా ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అబ్జర్వర్ అఫ్సర్ జాసువి, సాగరికారావు, నాగేందర్‌రెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ సుబ్బారావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఏఐసీసీ పరిశీలకుడు జాన్సన్ అబ్రహం