
గంగపుత్ర.. అభయ మిత్ర
వీరే గజ ఈతగాళ్లు..
గోదావరిలో ప్రమాదం జరిగితే తాహతుకు మించి ధైర్యసాహసాలు చేసి మరీ కాపాడుతారు. ఇప్పటికీ ఎంతోమందికి ప్రాణదాతలయ్యారు. వినాయక నిమజ్జనం సమయంలో వినాయక విగ్రహాలను అంతర్రాష్ట్ర వంతెన వద్ద నుంచి గోదావరిలోకి వదిలేందుకు వీరే ప్రముఖపాత్ర వహిస్తారు. రాత్రిపగలు విధులు నిర్వర్తిస్తారు. గోదావరి, సరస్వతి, ప్రాణహిత పుష్కరాలు, మహాశివరాత్రితో పాటు పలు ఉత్సవాలు జరిగిన సమయాల్లో గజ ఈతగాళ్లు విధులు నిర్వహిస్తారు. కాటారం సబ్‌డివిజన్‌లో ఎవరైనా నీటిలో మునిగి మృతిచెందినా వీరి సహాయంతో మృతదేహాలు బయటికి తీస్తారు. వీరు ఇప్పటికీ వందల మృతదేహాలు తీసి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరిలో కొంత మంది స్విమ్మింగ్‌లో శిక్షణ తీసుకుని లైసెస్స్ పొంది ఉన్నారు.
కాళేశ్వరం: గంగపుత్రులకు ధైర్యసాహాసాలు, సాయం అందించే గుణం ఎక్కువ. కాళేశ్వరంలో గోదావరిని నమ్ముకొని పూర్వం నుంచి జీవనోపాధిని పొందుతున్నారు. గ్రామంలోని హిందూ ముస్లింల ఉత్సవాల్లో వారు లేనిదే పల్లకీ కదలదు. గోదావరిమాత సాక్షిగా ప్రమాదవశాత్తు లేదా మృతిచెందిన వారిని కాపాడటంలో ఈ గజ ఈతగాళ్లు సమర్థులు. ఓటు బ్యాంకుతో కాళేశ్వరం సర్పంచ్‌ను డిసైడ్ చేసే సత్తా వారిది. అన్నింటికీ తాము సైతం అంటూ అభయహస్తం ఇస్తున్న వారిపై ప్రత్యేక కథనం.
పూర్వం నుంచి..
మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో పూర్వం నుంచి గంగపుత్రులు చేపల వేట, నాటు పడవలను కాళేశ్వరం టు నగరం(సిరొంచ) ఒడ్డుకు ప్రజలను చేరవేస్తూ జీవనం సాగించేవారు. 2016 డిసెంబర్‌లో కాళేశ్వరం–సిరొంచ పరిధిలో చింతలపల్లి వద్ద అంతర్రాష్ట్ర వంతెన నిర్మాణంతో వారి జీవనోపాధికి ఆటంకం కలిగింది. దీంతో టూరిజంశాఖ ద్వారా స్పీడ్ బోట్లు కొనుగోలు చేసి కాళేశ్వరం వచ్చే టూరిస్టులు, భక్తులను జలవిహారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. 65 గంగపుత్రుల కుటుంబాలు బోటులపై జీవిస్తున్నాయి. మొత్తం 400మంది సీ్త్రలు పురుషులు, చిన్నారుల వరకు ఉంటారు. స్థానిక సంస్థల్లో సర్పంచ్‌గా గెలువాలంటే వీరి ఆశీర్వాదం కావాల్సిందే. వారి చుట్టూరా రాజకీయం కూడా తిరుగుతుంది. వారు డిసైడ్ అయితే వారే సర్పంచ్‌గా గెలిచిన సందర్భాలు ఉన్నాయి.
హిందూ, ముస్లింల ఉత్సవాల్లో సేవలు
గోదావరిలో పడిపోతే..
కాపాడే ప్రాణదాతలు
మృతదేహాలు వెలికితీసే సమర్థులు