
రైతులు ఇబ్బందులు పడొద్దు
గణపురం: ఎరువుల సరఫరాలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం గణపురం మండలం చెల్పూరులో ఎరువుల విక్రయ కేంద్రం, పీహెచ్‌సీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎరువులు సరిపడా ఉన్నాయని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పట్టాలు లేని రైతులకు ఆదార్ కార్డు నమోదు చేస్తే ఎరువులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రాంతాలను గుర్తించి మెడికల్ క్యాంపులు నిర్వహించాలని.. ఇంటింటికీ సర్వే నిర్వహించి వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, మండల వ్యవసాయ అధికారి అయిలయ్య పాల్గొన్నారు.
ఐటీఐ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి
భూపాలపల్లి అర్బన్: ఐటీఐ ప్రవేశాలకు మూడో విడత దరఖాస్తులు స్వీకరిస్తున్నామని.. ఈ నెల 28వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాహుల్‌శర్మ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో ఐటీఐ ప్రవేశాల ప్రచార వాల్‌పోస్టర్ ఆవిష్కరించారు. వివరాలకు 85004 56034 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్, ఉపాధి కల్పన అధికారి శ్యామల పాల్గొన్నారు.
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం
జాతీయ చేనేత దినోత్సవాన్ని గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్‌శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మగ్గాలపై బట్టలు నేసే కార్మికులు చాలామంది ఉన్నారని, మహదేవపూర్ మండలంలో దసలి పట్టుతో నేసే బట్టలు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారన్నారు. చేనేత రంగంలో విశిష్ట కృషిచేసిన చేనేత కార్మికులను ఈ సందర్భంగా కలెక్టర్ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు భీమనాధుని సత్యనారాయణ, చేనేత సహకార సంఘం సొసైటీ చైర్మన్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ

రైతులు ఇబ్బందులు పడొద్దు