
హేమాచలక్షేత్రంలో సండే సందడి
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచలక్షేత్రానికి ఆదివారం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయంలోని స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రంలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ తదితర సుదూర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి వంటి ప్రాంతాల నుంచి తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకుని ఆలయ సమీపంలోని చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని తిలతైలాభిషేకం పూజలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారిని నూతన పట్టు వస్త్రాలతో అలంకరించి భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపించారు. స్వామివారి విశిష్టత ఆలయ చరిత్రను వివరించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకన్నారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. ఆలయ ప్రాంగణంలో నిత్య అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించి అన్నదాన కార్యక్రమ నిర్వహణకు విరాళాలు అందజేశారు.

హేమాచలక్షేత్రంలో సండే సందడి