
స్వచ్ఛతలో వెనుకబాటు
మూలనపడిన చెత్త సేకరణ వాహనాలు
భూపాలపల్లి: భూపాలపల్లి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా మారింది. చెత్త సేకరణ వాహనాలు మూలన పడటం, ఇళ్ల నుంచి చెత్త సేకరణలో నిర్లక్ష్యం ప్రదర్శించడం, వార్డులకు సరిపడా కార్మికులు లేకపోవడంతో నిత్యం పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. ఫలితంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల సాధనలో జాతీయ, రాష్ట్రస్థాయిలో భూపాలపల్లి వెనుకంజలో ఉంది.
సగం వాహనాలు మూలకే..
పట్టణంలో 30 వార్డులు ఉండగా సింగరేణి సంస్థ 7, మున్సిపాలిటీ 23 వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపడుతుంది. చెత్త సేకరణ, తరలింపు కోసం మున్సిపాలిటీలో 12 స్వచ్ఛ ఆటోలు ఉండగా.. అందులో నాలుగు మరమ్మతుకు నోచుకోని ఆటోలు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో మూలన పడి ఉన్నాయి. మరొకటి షోరూంలో ఇవ్వగా బిల్లు చెల్లించని కారణంగా బయటకు రావడం లేదు. మిగిలిన ఏడింటితోనే 23 వార్డుల్లో చెత్త సేకరించాల్సి వస్తుంది. మూడు ట్రాక్టర్లు, ఒక బ్రేడ్ ట్రాక్టర్ ఉండగా మరమ్మతుకు నోచుకొని ఆరు నెలలు కావొస్తుంది. ఫలితంగా ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా జరగకపోవడమే కాక వీధుల్లో చెత్త పేరుకుపోతుంది. బస్టాండ్, మార్కెట్, ప్రధాన కూడళ్లలో ఎప్పుడు చూసినా పారిశుద్ధ్య లోపం దర్శనమిస్తుంది. మురుగు కాలువల్లో నుంచి తొలగించిన చెత్తను రోడ్డు పక్కన పడేసి రోజులు గడుస్తున్నా తొలగించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
పారిశుద్ధ్య కార్మికులు ఇతర పనులకు..
పారిశుద్ధ్య కార్మికులు సరిపడా లేకపోవడమే కాక కొంతమందికి ఇతర పనులు కేటాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో 154 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండగా 67 మంది మాత్రమే శానిటేషన్ విధులు నిర్వర్తిస్తున్నారు. మిగిలిన 87 మంది డ్రైవర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, బిల్ కలెక్టర్, అటెండర్లుగా పనిచేస్తున్నారు. నలుగురు జవాన్లు మాత్రమే ఉండగా, శానిటరీ ఇన్‌స్పెక్టర్ లేకపోవడంతో జూనియర్ అసిస్టెంటే శానిటరీ విభాగాన్ని చూస్తున్నాడు.
అటకెక్కిన బయో మైనింగ్..
పట్టణంలో ప్రతీరోజు సేకరిస్తున్న చెత్త 21 టన్నుల వరకు వస్తుంది. డంపింగ్ యార్డుల్లో ఇప్పటివరకు సుమారు ఆరు వేల టన్నుల చెత్త పేరుకుపోయి ఉంది. ఆ చెత్తను బయో మైనింగ్ విధానం ద్వారా శుద్ధి చేసి, మళ్లీ ఉపయోగించేందుకు అవసరమైన ముడి సరుకును వేరుచేస్తారు. ఈ విధానంలో వచ్చిన మట్టి, రాళ్లు, ప్లాస్టిక్, ఇనుమును మున్సిపాలిటీ ఆధ్వర్యంలో విక్రయిస్తారు. ఈ విధానం కాగితాలకే పరిమితం అయింది. బయో మైనింగ్ విధానం కోసం కేంద్ర ప్రభుత్వం కేవలం రూ.6లక్షలు మాత్రమే మంజూరు చేసింది. తూకం వేసేందుకు వేబ్రిడ్జి నిర్మాణం, బయోమైనింగ్ యంత్రాల కొనుగోలుకు ఆ నిధులు సరిపోవడం లేదు. దీంతో టెండరు దక్కించుకున్న కాంట్రాక్టరు పనులు ప్రారంభించడం లేదు.
ప్రతిపాదనలు పంపాం..
చెత్త సేకరణ వాహనాల మరమ్మతుల అనుమతి కోసం మున్సిపాలిటీ ప్రత్యేక అధికారికి ప్రతిపాదనలు పంపాం. అనుమతి రాగానే వాహనాలను బాగు చేయించి వినియోగంలోకి తీసుకొస్తాం. ప్రస్తుతం ఉన్న వాహనాలతో పారిశుద్ధ్య పనులు చేపడుతున్నాం. సమస్య తలెత్తకుండా ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం చేపడుతున్నాం.
– బిర్రు శ్రీనివాస్,
భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్
మున్సిపాలిటీ సాధించిన ర్యాంకులు ఇలా..
సంవత్సరం రాష్ట్రస్థాయి జాతీయస్థాయి
ర్యాంకు ర్యాంకు
2022–2023 21 920
2023–2024 88 1,169
2024–2025 135 732
డోర్ టు డోర్ కలెక్షన్‌లో నిర్లక్ష్యం
సరిపడా లేని పారిశుద్ధ్య కార్మికులు
సమస్యలపై దృష్టి సారించని
మున్సిపాలిటీ అధికారులు
‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో
రాష్ట్రంలో 135వ ర్యాంకు

స్వచ్ఛతలో వెనుకబాటు

స్వచ్ఛతలో వెనుకబాటు