నాణ్యమైన భోజనం, విద్యాభ్యాసం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన భోజనం, విద్యాభ్యాసం

Jul 25 2025 4:47 AM | Updated on Jul 25 2025 4:47 AM

నాణ్యమైన భోజనం, విద్యాభ్యాసం

నాణ్యమైన భోజనం, విద్యాభ్యాసం

భూపాలపల్లి: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు నాణ్యమైన భోజనం, విద్యాభ్యాసం అందించాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో విద్యా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ అధికారులు, డీసీఓలు, ప్రత్యేక అధికారులు, రెసిడెన్షియల్‌, వసతి గృహాల ప్రిన్సిపాల్‌లు, ప్రధానోపాధ్యాయులు, తదితర అధికారులతో వసతి గృహాలు, పాఠశాలల్లో సౌకర్యాల కల్పనపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రతీ శుక్రవారం ప్రత్యేక అధికారులు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు. ఆహార నాణ్యతలు పాటించేందుకు ఆహార కమిటీలను ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇబ్బంది పడుతున్న విద్యార్థులను గుర్తించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేలా కౌన్సెలింగ్‌ చేయాలన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలి..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, భూ భారతి దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. ఐడీఓసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, గృహ నిర్మాణ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. కాటారం డివిజన్‌లోని పైలెట్‌ మండలాల్లో అన్ని ఇండ్ల నిర్మాణం చేపట్టేలా చూడాలన్నారు. ఆగస్టు 15వ తేదీ వరకు భూ భారతి దరఖాస్తుల విచారణ పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో కాటారం సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, అదనపు కలెక్టర్లు అశోక్‌కుమార్‌, విజయలక్ష్మి పాల్గొన్నారు.

పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు..

ఈ నెల 27న నిర్వహించనున్న గ్రామ పరిపాలన అధికారి, లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ రాహుల్‌ శర్మ సూచించారు. ఐడీఓసీ కార్యాలయ సమావేశపు హాల్‌లో రెవెన్యూ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గ్రామ పాలన అధికారి పరీక్షను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నామని, 38మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌ పరీక్ష జిల్లా కేంద్రంలోని జీవీటీసీ కేంద్రంలో రాత, ప్రాక్టికల్‌ పరీక్షలను అదే రోజు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు

కాటారం: ఎరువుల కృత్రిమ కొరత సృష్టించినా, బ్లాక్‌ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు విక్రయించినా చర్యలు తప్పవని కలెక్టర్‌ రాహుల్‌శర్మ హెచ్చరించారు. గారెపల్లి పీఏసీఎస్‌ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల దుకాణం, మండల కేంద్రంలోని మరో రెండు ఫైర్టిలైజర్‌ దుకాణాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. మండలకేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతి బా పూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, తరగతిగదులు, వంటశాల, స్టోర్‌ రూం, కూరగాయల నిల్వలు కలెక్టర్‌ పరిశీలించారు. జీవన జ్యోతి మండల మహిళా సమైఖ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కుట్టు మిషన్‌ శిక్షణ కేంద్రం, చిల్డ్రన్స్‌ పార్క్‌ పరిశీలించారు. కలెక్టర్‌ వెంట సబ్‌కలెక్టర్‌ మయాంక్‌సింగ్‌, వ్యవసాయ అధికారి బాబు, డీఈఓ రాజేందర్‌, తహశీల్దార్‌ నాగరాజు, ఎంపీడీఓ బాబు, ఏడీఏ శ్రీపాల్‌, ఎంపీఓ వీరస్వామి ఉన్నారు.

కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం..

వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ తెలిపారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు 90306 32608 కంట్రోల్‌ రూం నంబర్‌కు కాల్‌ చేసి సమాచారం అందించాలని సూచించారు. కంట్రోల్‌ రూం 24 గంటల పాటు పనిచేస్తుందని, ప్రజలు ఏ సమయంలోనైనా ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాల వల్ల ముంపునకు గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

హాస్టళ్లలో విద్యార్థులకు

ఇబ్బందులు కలుగొద్దు

కలెక్టర్‌ రాహుల్‌ శర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement