
కాళేశ్వరాలయంలో జిల్లా జడ్జి పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామిని జిల్లా జడ్జి సీహెచ్ రమేష్‌బాబు గురువారం దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామివారి గర్భగుడిలో అభిషేకం, అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. అనంతరం ఆయనకు స్వామి వారి శేష వస్త్రాలతో ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ సన్మానించి, తీర్థ ప్రసాదం, ఆశీర్వచనం అందజేశారు.
29న అథ్లెటిక్స్
చాంపియన్‌షిప్ పోటీలు
భూపాలపల్లి అర్బన్: జిల్లాస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలను ఈ నెల 29న అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూతల సమ్మయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అండర్–8 నుంచి అండర్–20లోపు బాలబాలికలు, మహిళలు, పురుషులకు పరుగు పందెం, స్టాండింగ్ బ్రాండ్ జంప్, లాంగ్‌జంప్, జావెలిన్ ట్రెయాతలాన్, షాట్‌పుట్ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు సర్టిఫికెట్ ప్రదానం చేసి ఆగస్టు 3న హనుమకొండ, 7న జనగామలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
వర్షానికి కూలిన ఇల్లు
మల్హర్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మండలంలోని కొయ్యూరు గ్రామానికి చెందిన ఎడ్ల లక్ష్మి ఇల్లు గురువారం కూలింది. మంగళవారం, బుధవారం కురిసిన వర్షానికి ఇల్లు తడిసింది. దీంతో ఇంటి పై కప్పు భాగం రెండు వైపులా కూలిపోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు ఇల్లే దిక్కని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కోరారు.
బొగతలో మరమ్మతులు
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి గ్రామ సమీపంలో ఉన్న బొగత జలపాతం వద్ద గురువారం మరమ్మతు పనులను చేపట్టారు. మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షానికి జలపాతం సమీపంలో ఉన్న రెయిలింగ్, భద్రత కోసం ఏర్పాటు చేసిన కంచె కొట్టుకు పోయాయి. దీంతో గురువారం రేంజర్ చంద్రమౌళి, ఫారెస్టర్ భిక్షపతి, ఎఫ్‌బీఓ ప్రసాద్ ఆధ్వర్యంలో బొగత సిబ్బంది రెయిలింగ్ మరమ్మతు పనులను చేపట్టారు.