
ముసురు వాన
రెండు రోజులుగా కురుస్తున్న వర్షం
● చెరువుల్లోకి చేరుతున్న వరద నీరు
● వాగుల్లో ఇప్పుడిప్పుడే జలకళ
● పలుచోట్ల వాగుల్లో తెగిన
తాత్కాలిక రోడ్లు
● రాకపోకలకు అంతరాయం
● సింగరేణి ఉపరితల గనుల్లో
నిలిచిన బొగ్గు ఉత్పత్తి
భూపాలపల్లి: వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా వానలు అంతంత మాత్రంగానే కురవడంతో రైతులు ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా జిల్లాలో ఎడతెరపి లేని వర్షం పడుతుంది. దీంతో వర్షాకాల వాతావరణం కనిపిస్తుంది. వాగుల్లో జలకళ కనిపిస్తుండగా చెరువుల్లోకి వరద నీరు చేరుతుంది. మానేరు వాగులో వేసిన తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
జలాశయాల్లో జలకళ..
జిల్లాలో మంగళవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు ఎడతెరపి లేని వర్షం కురిసింది. ఫలితంగా వారం రోజుల క్రితం వరకు ఎడారిలా తలపించిన చెరువులు వరదనీరు రావడంతో జలకళను సంతరించుకున్నాయి. వాగుల్లో సైతం ఇప్పుడిప్పుడే వరద నీరు పారుతోంది. బుధవారం కురిసిన వర్షానికి టేకుమట్ల మండలం వెలిశాల చెరువు మత్తడి పోస్తుంది. టేకుమట్ల మండలం బూర్నపల్లి–కిష్టంపేట, కలికోట–పెద్దపల్లి జిల్లా ఓడేడు మధ్య గల మానేరు వాగుల్లో తాత్కాలిక రోడ్డు కోతకు గురైంది. దీంతో భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇదే మండలంలోని సోమనపల్లిలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మరో రెండు రోజుల పాటు ఇలాగే వర్షాలు కురిస్తే జిల్లాలోని ప్రధాన రిజర్వాయర్‌లు మినహా చెరువులన్నీ మత్తడి పోసే అవకాశాలు ఉన్నాయి.
ఓపెన్‌కాస్ట్‌ల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి..
వర్షం కారణంగా బుధవారం జిల్లాలోని సింగరేణి ఉపరితల గనుల్లోకి వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మల్హర్ మండలం తాడిచర్ల ఓపెన్‌కాస్ట్‌లో 12వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా, భూపాలపల్లి ఏరియాలోని ఓపెన్‌కాస్ట్ 2, 3 ప్రాజెక్టుల్లో ఒక్కరోజే మూడు షిఫ్ట్‌ల్లో కలిసి 4వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు.
గోదావరిలో స్వల్పంగా వరద..
కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద బుధవారం 5.560 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తుంది. వరద నీరు కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మి) బ్యారేజీకి చేరుతుంది. దీంతో బ్యారేజీలోని మొత్తం 85గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు తరలిస్తున్నారు. అక్కడ 98,440 క్యూసెక్కుల వరద ప్రవాహం దిగువకు విడుదల అవుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కాళేశ్వరానికి ఎగువన ఉన్న మహదేవపూర్ మండలంలోని అన్నారం(సరస్వతీ)బ్యారేజీకి వరద నీరు స్వల్పంగానే వస్తుంది.
బుధవారం వర్షాపాతం
వివరాలు (మి.మీ)
మహదేవపూర్ 47.3
మహాముత్తారం 36.5
కాటారం 32.0
కొయ్యూరు 22.0
భూపాలపల్లి 20.5
మల్లారం 20.3
చెల్పూరు 16.3
కాళేశ్వరం 15.0
టేకుమట్ల 14.5
చిట్యాల 13.5
రేగొండ 12.8
రేగులగూడెం 9.3
తాడిచర్ల 8.8
మొగుళ్లపల్లి 6.0

ముసురు వాన

ముసురు వాన