
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: ఈ విద్యా సంవత్సరానికి గాను జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగ, మైనారిటీ విద్యార్థులు నూతన, రెన్యువల్ కోసం సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
అంబేడ్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి
పథకానికి..
2025–26 విద్యా సంవత్సరానికి గాను విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థుల నుంచి అంబేడ్కర్ ఓవర్‌సిస్ విద్యానిధి పథకా నికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షె డ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లాలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులు ఆగస్టు 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రెండవ విడత ఐటీఐ ప్రవేశాలకు..
ఐటీఐ రెండవ విడత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు భూపాలపల్లి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ జుమ్లానాయక్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్‌సీవీటీ ప్యాట్రన్ కింద వివిధ ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ ట్రేడ్‌లలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేపు పెన్షన్‌దారుల
జిల్లా సదస్సు
భూపాలపల్లి రూరల్: ఈనెల 25న జిల్లాకేంద్రంలోని భారత్ ఫంక్షన్‌హాల్‌లో పెన్షన్‌దారుల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబాల చంద్రమౌళి తెలిపారు. సదస్సుకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృఫ్ణ మాదిగ హాజరవుతున్నారని.. విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. దివ్యాంగులు, పెన్షన్‌దారులు హాజరుకావాలని కోరారు.
బీజాపూర్ ఎమ్మెల్యే పూజలు
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి వారిని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ఎమ్మెల్యే విక్రమ్ మాండవి దర్శించుకున్నారు. ఆయన బుధవారం ఆలయానికి రాగా అర్చకులు మర్యాద పూర్వక స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారికి అభిషేకం నిర్వహించి శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో దర్శనం చేశారు. అనంతరం అక్కడ స్వామివారి శేషవస్త్రాలతో అర్చకుడు రామాచార్యులు సన్మానించి ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదం అందజేశారు.
ఎంజేపీ పాఠశాల తనిఖీ
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని ఎంజేపీ గురుకుల బాలుర పాఠశాలను బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డి.శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలు, తరగతి, హాస్టల్, వంట గదులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా నిత్యం పర్యవేక్షణ చేయాలన్నారు. వర్షాకాలంలో విద్యార్థులు వ్యాధుల బారిన పడకుండా వైద్య పరీక్షలు చేపించాలని సూచించారు. మెనూ పాటించాలని, సరుకుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు.
ఎరువుల గోదాం తనిఖీ
మొగుళ్లపల్లి: మండలకేంద్రంలోని పీఏసీఎస్ ఎరువుల గోదాంను జిల్లా సహకార అధికారి వాల్యానాయక్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువులకు సంబందించిన వివరాలను పరిశీలించారు. యూరియా విక్రయాలు తదితర అంశాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. పట్టదారుపాస్‌బుక్, ఆధార కార్డ్ ద్వారా ప్రతీ రైతుకు రెండు యూరియా బస్తాలు అందించాలని..ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట సీఈఓ అప్పం సాగర్ ఉన్నారు.

దరఖాస్తుల స్వీకరణ

దరఖాస్తుల స్వీకరణ