
మంత్రులు నిధుల వర్షం కురిపించారు..
భూపాలపల్లి: రాష్ట్ర మంత్రులు భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తున్నారు.. పోతున్నారు.. చేసిందేమీ లేదని, కొందరు ప్రతిపక్ష పార్టీల నాయకులు అనడంలో అర్థం లేదని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రుల సహకారంతో గణపురం మండలంలోని గాంధీనగర్‌లో ఇండస్ట్రీయల్ పార్కు వద్ద రూ.4 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. రూ. 5.50 కోట్లతో చెల్పూరు బస్టాండ్ నిర్మాణం చేపట్టబోతున్నామని, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు జిల్లాకేంద్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను మంత్రులు ప్రారంభించారన్నారు. కొడవటంచ, బుగులోని జాతర, కోటగుళ్ల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చానని, రూ. 200 కోట్లతో గాంధీనగర్ వద్ద నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్ టెండర్ల దశలో ఉందన్నారు. జిల్లా ఆస్పత్రిలో వెంటిలేటర్లు ఏర్పాటు చేయించానని, సీటి స్కాన్ యంత్రం వచ్చిందని, త్వరలోనే నిపుణుడిని నియమిస్తామన్నారు. వంద రోజుల్లోపు రూ. 9.80 కోట్ల విలువైన ఎంఆర్‌ఐ మిషన్‌ను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. రూ. 480 కోట్లతో నిర్మించనున్న భూపాలపల్లి బైపాస్ రోడ్డు డీపీఆర్ దశలో ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని విడుదల చేయడం లేదని కొందరు అంటున్నారని, గేట్లు తెరిస్తే జిల్లాకు చుక్క నీరైనా వస్తుందా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పుప్పాల రాజేందర్, చల్లూరి మధు, ముంజాల రవీందర్, దాట్ల శ్రీనివాస్, శిరుప అనిల్, తోట రంజిత్ పాల్గొన్నారు.
త్వరలోనే జిల్లా ఆస్పత్రికి
ఎంఆర్‌ఐ స్కాన్ మిషన్
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు