పుస్తకాల మోత | - | Sakshi
Sakshi News home page

పుస్తకాల మోత

Jul 21 2025 5:51 AM | Updated on Jul 21 2025 5:51 AM

పుస్త

పుస్తకాల మోత

పెరిగిన పుస్తకాల బరువు..

జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలలు 75వరకు ఉండగా, వాటిలో సుమారు 15వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో ఒకప్పుడు ఆరు సబ్జెక్టులకు ఆరు నోట్‌బుక్స్‌తో పాటు ఒక రఫ్‌ బుక్‌ ఉండేది. ఇప్పుడు సబ్జెక్టుకు ఒక రఫ్‌ బుక్‌తోపాటు గైడ్లు, డ్రాయింగ్‌, స్క్రాప్‌ బుక్స్‌, రికార్డులు, డైరీలు స్కూల్‌ బ్యాగుల్లో కిలోల కొద్ది పుస్తకాలు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులు 6నుంచి 12 కిలోల బరువైన బ్యాగులు.. ఉన్నత పాఠశాలల విద్యార్థులు 12నుంచి 17కిలోల బ్యాగులను ప్రతి రోజు వీపు మీద మోస్తున్నారు. రోజు ఇంతింత బరువులు మోయడం, ఒకటి, రెండు అంతస్తుల మోడలు ఎక్కి క్లాస్‌రూం వరకు వెళ్లడం కారణంగా చాలామంది పిల్లలు వెన్నునొప్పి, జాయింట్‌ పెయిన్స్‌ బారిన పడుతున్నారు. ఇది విద్యార్థుల శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతోంది.

ప్రభుత్వ ఆదేశాలను

పట్టించుకోని ప్రైవేట్‌ పాఠశాలలు

సొంత సిలబస్‌తో బరువెక్కుతున్న బ్యాగులు

అధిక బరువు బ్యాగులతో వంగిపోతున్న విద్యార్థులు

భూపాలపల్లి అర్బన్‌: బాల్యం భవిష్యత్‌పై పుస్తకాల భారం పెరుగుతోంది. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు తమ సొంత సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ సంఖ్య మోతెక్కిస్తున్నాయి. దీంతో బ్యాగుల బరువు మోయలేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలకు తోడు టిఫిన్‌బాక్స్‌, వాటర్‌బాటిల్‌, బూట్లు తదితర వస్తువులు మరింత భారంగా మారుతున్నాయి. పిల్లల బాధ చూడలేక చాలామంది తల్లిదండ్రులు పాఠశాల వరకు బ్యాగులు మోసుకెళ్లి దిగబెట్టి వస్తున్నారు. పుస్తకాల బరువుపై ప్రభుత్వం ఐదేళ్ల క్రితం మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు. ఈ విద్యాసంవత్సరం కూడా గత విద్యాసంవత్సరం లాగే కొనుగోలు చేయాల్సిన పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ జాబితాను అప్పగించి బలవంతంగా కొనుగోలు చేయించారు.

ప్రభుత్వ మార్గదర్శకాలివే..

చిన్నారులకు కిలోల కొద్ది బ్యాగుల మోతను తగ్గించేలా రాష్ట్ర విద్యాశాఖ 2020 సంవత్సరంలో మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం ఒకటి, రెండో తరగతుల పుస్తకాల బరువు బ్యాగుతో సహా 1.5 కిలోలు మాత్రమే ఉండాలి. ప్రస్తుతం జిల్లాలోని పాఠశాలలో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ, ఒకటి, రెండు తరగతుల పిల్లల బ్యాగులే సుమారు 4నుంచి 8 కిలోల బరువు ఉంటున్నాయి. మూడు, నాలుగు, ఐదు తరగతులకు 3 కిలోలు, ఆరు, ఏడు తరగతులకు 4 కిలోలు, ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు నాలుగున్నర నుంచి ఐదు కిలోల వరకు మాత్రమే బ్యాగు బరువు ఉండాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. ఈ నిబంధనలను అమలు చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.

ఒక్కో తరగతికి 30 పుస్తకాలపైనే..

జిల్లాలో పలు ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో ప్రైమరీకి 15నుంచి 25 పుస్తకాలు ఉండగా హైయర్‌లో 30 పుస్తకాలకు పైగా ఉన్నాయి. కేంద్రంలోని ఒక ప్రైవేట్‌ పాఠశాలలో 8వ తరగతిలో 32 రకాల పుస్తకాలను పాఠశాలలోనే ఇచ్చారు. పాఠ్య పుస్తకాలతో పాటు నోట్‌ పుస్తకాలు, డ్రాయింగ్‌, స్టోరీ, డైరీ, ఇతర వర్కుబుక్‌లను ఇచ్చారు.

అమలు చేయాల్సిందిలా..

ఆరు, ఏడు తరగతులకు మూడు లాంగ్వేజ్‌ బుక్స్‌తో పాటు గణిత, సామాన్యశాస్త్రం, సాంఘికశాస్త్రం, సహా మొత్తం ఆరు పుస్తకాలే ఉండాలి. ఎనిమిది, తొమ్మిది, పదో తరగతులకు ఈ ఆరు పుస్తకాలతో పాటు జీవశాస్త్‌త్రం కలిపి ఏడు పాఠ్యపుస్తకాలు ఉండాలి. ప్రతీ సబ్జెక్టుకు 200 పేజీల నోట్‌బుక్‌ మాత్రమే ఉపయోగించాలి. వాటిని ఎఫ్‌ఏలకు, స్లిప్‌టెస్టులకు వినియోగించాలి. ఇవి కూడా రోజు తీసుకురావాల్సిన అవసరం లేదు. పాఠ్యాంశాల చివరన ఉన్న ఎక్సర్‌సైజ్‌లను ఉపాధ్యాయుల పర్యవేక్షణలో పాఠశాలల్లోనే పూర్తి చేయాలి. ఇందుకోసం ప్రత్యేక పీరియడ్లను కేటాయించాలి. ఆరు నుంచి పదో తరగతుల విద్యార్థులకు హోంవర్క్‌ కోసం ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో రోజు కేటాయించేలా ప్రణాళిక ఉండాలి. ఏ సబ్జెక్టుకు ఏ రోజు అనేది ఉపాధ్యాయులు ఏయే పాఠ్య పుస్తకాలు, నోటుబుక్స్‌ తెచ్చుకోవాలో టీచర్లు ముందుగానే చెప్పాలి. స్టేట్‌ సిలబస్‌ను అమలుచేసే అన్ని పాఠశాలలు రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి నిర్ణయించిన పుస్తకాలనే వినియోగించాలి. అంతకుమించి అదనపు పుస్తకాలేవీ ఉపయోగించకూడదు.

పుస్తకాల మోత
1
1/1

పుస్తకాల మోత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement