
సాగు సగమే..
భూపాలపల్లి రూరల్: జిల్లాలో వర్షభావంతో సాగు ఇప్పటివరకు సగానికే పరిమితమైంది. జిల్లాలో వానాకాలం సీజన్‌కు సంబంధించి 2,06,469 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పటివరకు కేవలం 1,01,387 ఎకరాలు సాగైంది. అంచనాలకు మించి సాగులోకి వస్తుందని భావించిన పత్తి సైతం 97,870 ఎకరాల్లోనే సాగైంది. ఈనెల 15తో విత్తు గడువు ముగిసింది. ప్రధాన పంట వరి 1,12,218 ఎకరాల్లో సాగులోకి వస్తుందని అంచనా వేయగా ప్రస్తుతానికి 3,231 ఎకరాల్లో మాత్రమే నాట్లు వేశారు. మరో 1,08,987 ఎకరాల్లో వరి నారు సిద్ధంగా ఉంది. మొక్కజొన్న 87 ఎకరాలు సాగు చేయగా, కంది 21 ఎకరాలు, పెసర్లు 85 ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి.
వరి రైతుల్లో దిగులు..
జిల్లాలో వరి సాగుపై నీలినీడలు అలుముకున్నాయి. ఈసారి వరి అంచనాలకు మించి 1,12,218 ఎకరాల్లో సాగులోకి వస్తుందని భావిస్తే ఇప్పటివరకు భారీ వర్షాలు లేకపోవడం రైతులను కుంగదీస్తుంది. ఎక్కడా కూడా చెరువులు, కుంటల్లో నీరులేకపోవడం కూడా కలవరానికి గురి చేస్తుంది. నారుమడులు సిద్ధంగా ఉన్నా.. నాటు వేయడానికి రైతులు వెనకంజ వేస్తున్నారు. భారీ వర్షాలు వచ్చి ఉంటే బోరుబావుల్లో భూగర్భజలాలకు ఢోకా ఉండేది కాదు. భూగర్భజలాలు తగ్గి బోర్లు కూడా సన్నగా పోస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈసారి రైతులు వరి సాగును తగ్గుంచుకునే ఆలోచనలో ఉన్నారు. భారీ వర్షాలు వచ్చి ఉంటే బోరుబావుల్లో భూగర్భ జలమట్టానికి ఢోకా ఉండేది కాదు. బోరు బావుల్లో నీరు తగ్గడం.. మరోవైపు వర్షాలేక సాగును తగ్గించుకునే ఆలోచనలో రైతులు ఉన్నారు. భారీ వర్షాలొస్తే తప్ప సాగు స్వరూపం మారే అవకాశం కనిపించడం లేదు.
2.06 లక్షల ఎకరాల అంచనా
ఇప్పటివరకు సాగైంది..
1,01,387 ఎకరాలు
వరి నాట్లు కేవలం 3,231 ఎకరాల్లోనే..
వర్షాభావంతో అంతంతమాత్రమే
ఈ ఫొటోలోని రైతు గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మాసం రాకేష్. గ్రామంలో ఐదెకరాలకు 1224 సన్న రకం ధాన్యానికి సంబంధించి నారు పోసుకున్నాడు. వర్షం కురిస్తే నాట్లు వేద్దామని ఎదురుచూస్తున్నాడు. వర్షాలు లేకపోవడంతో నారు ముదిరిపోతుందని రాకేష్ ఆందోళన చెందుతున్నాడు. బోరునీరు సరిగా రాకపోవడంతో పక్కన ఉన్న వారి బోరుతో నారుమడికి నీరుపెడుతున్నాడు. మరో పదిరోజులు వర్షాలు కరువకుంటే నారు పనికి రాకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. జిల్లాలో చాలామంది రైతుల పరిస్థితి ఇలానే ఉంది.
ఆగస్టు 15వరకు నాట్లు వేసుకోవచ్చు..
వాతావరణ శాఖ సూచనలతో త్వరలోనే మంచి వర్షాలు వచ్చే అవకాశం ఉంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెట్ట వంటల సాగు ప్రస్తుతం జరుగుతోంది. వర్షాలు సమృద్ధిగా వస్తే వరి సాగుకు ఇబ్బంది ఉండదు. ఆగస్టు చివరివరకు వరి నాట్లు వేసుకోవచ్చు.
– బాబురావు,
జిల్లా ఇన్‌చార్జ్ వ్యవసాయ అధికారి
24.1మి.మీ.ల లోటు వర్షపాతం..
వానాకాలం సీజన్ ఆరంభం నుంచి ఇప్పటివరకు జిల్లాలో లోటు వర్షపాతమే నమోదవుతుంది. జూలైలో ఇప్పటివరకు 211.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 108.6 మిల్లీమీటర్లు నమోదైంది. 24.1 మిల్లీమీటర్లు లోటు వర్షపాతం నమోదైంది. సగానికి పైగా మండలాల్లో సరైన వర్షం లేక సరిగా పత్తి గింజలు మొలకెత్తలేదు. రెండేసి సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు పత్తి పంటలకు అనుకూలంగా మారాయి.

సాగు సగమే..

సాగు సగమే..