
డంపింగ్ యార్డుగా కేన్‌ప్రాంతం
వెంకటాపురం(ఎం): తెలంగాణ రాష్ట్రంలోనే అరుదుగా లభించే కేన్ మొక్కల రక్షిత ప్రాంతం అధికారుల నిర్లక్ష్యంతో డంపింగ్ యార్డుగా మారుతుందని కేన్ మ్యాన్ ఆఫ్ తెలంగాణ, వృక్ష శాస్త్రవేత్త డాక్టర్ సుతారి సతీష్ ఆరోపించారు. సోమవారం పరిశోధక బృందంతో కలిసి ఆయన మండల పరిధిలోని పాలంపేట పరిధిలో గల కేన్ రక్షిత ప్రాంతాన్ని సందర్శించి మాట్లాడారు. ప్రజలు అవగాహన లోపంతో కేన్ ప్రాంతంలో వ్యర్థ పదార్థాలు, చెత్త వేస్తూ డంపింగ్ యార్డుగా మారుస్తున్నారని పేర్కొన్నారు. అధికారులు స్పందించి కేన్ ప్రాంతాన్ని పరిరక్షిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరారు. వన మహోత్సవంలో భాగంగా కేన్ ప్రాంతంలో అటవీ సంబంధ దేశీయ మొక్కలను నాటే విధంగా కృషి చేయాలని ఉన్నతాధికారులను సతీష్ కోరారు.