
మహిళలపై దాడులను అరికట్టాలి
భూపాలపల్లి అర్బన్: మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టాలని భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) జిల్లా కార్యదర్శి కొరిమి సుగుణ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని రావినారాయణరెడ్డి భవన్‌లో (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) నిర్మాణ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణ మాట్లాడుతూ.. దేశం, రాష్ట్రంలో మహిళలపై అనేక అత్యాచారాలు, దాడులు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వాలు వాటిని అరికట్టడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచార దాడులను అరికట్టేందుకు దేశంలో నూతన చట్టాలు తీసుకురావాలని కోరారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించి మహిళలు రాజకీయాల్లో రాణించే విధంగా అవకాశాలు కల్పించాలన్నారు. మహిళల అభివృద్ధికి ప్రభుత్వాలు తోడ్పాటునందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు గోలి లావణ్య, పెద్దమామల సంధ్య, క్యాతరాజు అనూష, పల్లెల రజిత, గడ్డం స్వరూప, కటకోళ్ల భారతి, ఇటుకల శ్రీలత పాల్గొన్నారు.