మొలకెత్తలే..
రేగొండ: గత నెలాఖరులో మురిపించిన తొలకరి వర్షాలకు పత్తి విత్తనాలు విత్తిన రైతులు ఆ తర్వాత వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేకపోవడంతో విత్తనాలు మొలకెత్తే సమయానికి భూమి లో తేమ శాతం లేకపోవడంతో విత్తనాలు మాడిపోతున్నాయి. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో రైతులు మళ్లీ దుక్కులు దున్ని విత్తనాలు వేయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఊరించి.. ఉసూరుమనిపించి..
జిల్లావ్యాప్తంగా ఈ సారి సీజన్‌లో 93వేల 823 ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. గత నెలాఖరులో కురిసిన తొలకరి వర్షాలకు పలువురు రైతులు 46వేల ఎకరాల్లో పత్తి విత్తనాలు విత్తారు. రేగొండ మండలంలో అత్యధికంగా 18వేల ఎకరాల్లో సాగుచేశారు. 20 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో విత్తనాలు మొలకెత్తే పరిస్థితులు లేవు. దీంతో పలువురు రైతులు పత్తి చేన్లకు నీళ్లు పెడుతున్నారు. పత్తి సాగు ఆరంభంలోనే రైతులకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడడంతో ఇబ్బందులు పడుతున్నారు.
భూమిలోనే మాడిపోతున్నాయి..
రేగొండ మండలంలో ప్రధానంగా జగ్గయ్యపేట, జూబ్లీనగర్, కొత్తపల్లిగోరి, రేపాక తదితర గ్రామాలలో సుమారు 12వేల ఎకరాలలో విత్తనాలు విత్తారు. విత్తనాలు వేసి వారం, పది రోజులవుతున్నప్పటికీ వర్షాలు ముఖం చాటేయడంతో భూమి లోపలి వేడి, బయటి ఉష్ణోగ్రతలకు విత్తనాలు భూమిలోనే మాడిపోతున్నాయి. మొలకెత్తిన విత్తనాలు వర్షాలు లేక ఎండిపోతున్నాయి. దీంతో జగ్గయ్యపేట, కొత్తపల్లిగోరి, రాజక్కపల్లి శివారులోని కొంత మంది రైతులు విత్తనాలు మొలకెత్తేందుకు వీలుగా పత్తి చేన్లకు నీటి తడులు పెడుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆకాశం మేఘావృతమైనప్పటికీ అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే పడ్డాయి.
పత్తిసాగుకు ఆదిలోనే అడ్డంకులు
ఇప్పటికే 46వేల ఎకరాల్లో
పత్తి సాగు
వర్షాభావ పరిస్థితులతో
రైతుల ఆందోళన
తొలకరి వర్షాలకు తొందరపడొద్దు
రైతులు తొందరపడి పత్తి విత్తనాలు విత్తొద్దు. తొలకరి వర్షాలకు భూమి లోపలి వేడి తగ్గదు. కనీసం 60 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత విత్తనాలు వేయాలి. వర్షాలు విస్తారంగా కురిసేటప్పుడు విత్తనాలు వేస్తే బాగుంటుంది.
– వాసుదేవారెడ్డి,
మండల వ్యవసాయ అధికారి, రేగొండ
విత్తనాలు మొలకెత్తలేదు..
పది రోజుల క్రితం కురిసిన వర్షానికి రెండెకరాల్లో పత్తి విత్తనాలు విత్తిన. వర్షాలు పడకపోవడంతో మొలకెత్తలేదు. ఎండవేడికి విత్తనాలు భూమిలోనే మాడిపోయాయి. రెండు రోజుల నుంచి నీటి తడులు అందిస్తున్నాను.
– మానూరి అశోక్, కొత్తపల్లిగోరి
మొలకెత్తలే..
మొలకెత్తలే..


