లింగ నిర్ధారణను ప్రోత్సహిస్తే నేరమే
భూపాలపల్లి అర్బన్: లింగ నిర్ధారణ పరీక్ష చేయడం, పరీక్ష చేయించడం, ప్రోత్సహించడం నేరమేనని అందరూ శిక్షార్హులు అవుతారని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మధుసూదన్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. జిల్లాలో ప్రస్తుతం 14 స్కానింగ్ సెంటర్లు ఉన్నాయని, ఇందులో ఐదు ప్రభుత్వ ఆధీనంలో 9 ప్రైవేట్ సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. లింగ నిర్ధారణ పరీక్షల నిరోధంపై దృష్టి పెట్టాలన్నారు. లింగ నిర్దారణ పరీక్ష నిషేధ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. పరీక్షలు చేయించి ప్రోత్సహించిన వారికి మూడేళ్లు జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధిస్తారని తెలిపారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94405 86982, 63032 39891 నంబర్లకు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, గైనకాలజిస్టు డాక్టర్ కవిత, పీడియాట్రిషన్ డాక్టర్ సురేందర్, డెమో శ్రీదేవి, సోషల్ వర్కుర్లు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మధుసూదన్


