
కుంభాభిషేకంతో ఘనకీర్తి
కాళేశ్వరం: కాళేశ్వరంలో అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన కుంభాభిషేకంతో కాళేశ్వరాలయానికి ఘనకీర్తి పెరిగింది. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో కాళేశ్వరాలయం, అనుబంధ దేవాలయాల గోపురాలకు సంప్రోక్షణను ప్రత్యేకంగా తుని తపోవనం పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతిస్వామి, దుద్దిళ్ల మనోహరశర్మ ఆయన శిశ్యబృందంతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ఆలయం కీర్తి దేశ నలుమూలలకు వ్యాపించి లక్షలాదిగా భక్తులు కాళేశ్వరం తరలివచ్చారని పండితులు పేర్కొన్నారు.
అప్పుడు కుంభాభిషేకంతో..
కాళేశ్వరాలయం 1975కు పూర్వం శిథిలావస్థకు చేరింది. ఆ తరువాత అప్పటి రవాణాశాఖ మంత్రి జువ్వాడి చొక్కారావు చొరవతో జీర్ణోద్ధరణ కమిటీ వేసి 1982లో ఆదిశంకరాచార్యులతో మహాకుంభాభిషేకం నిర్వహించగా, అప్పటి నుంచి నేటివరకు ఆలయం ప్రతిష్ట పెరిగి నిత్యం భక్తులతో విరాజిల్లుతుంది. ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా సరస్వతినది పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు
రాష్ట్ర ప్రభుత్వం రూ.35కోట్ల వరకు అభివృద్ధి పనులు చేపట్టింది. తాత్కాలిక, శాశ్వత పనులు చేశారు. ఆరు నెలల ముందు నుంచి దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కమిషనర్ పలుమార్లు సమీక్షలతో సరస్వతీ నది పుష్కరాల విజయానికి బాటలు వేశారు. ప్రభుత్వం తరుఫున మంథని నియోజకవర్గం శాసన సభ్యుడు, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి అఽధికారులతో హైదరాబాద్, కాళేశ్వరంలో రెండుసార్లు పర్యటించి పనుల్లో వేగం పెంచి విజయవంతం చేయడానికి కృషి చేశారు. సరస్వతీ నది పుష్కరాల్లో 12 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి సుమారు 15లక్షలకుపైగా భక్తులు తరలి వచ్చారు. పుష్కరిణిలో స్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. 15న సీఎం, 24న గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, మంత్రులు, సీఎస్ రామకృష్ణారావు వేర్వేరుగా స్నానాలు చేసి దర్శనాలు చేసుకున్నారు.
17 అడుగుల సరస్వతీ మాత విగ్రహం
తమిళనాడు మహాబలిపురానికి చెందిన శిల్పులు 17 అడుగుల ఏకశిలా విగ్రహాన్ని తయారు చేశారు. దీంతో వీఐపీఘాటులో ప్రత్యేకంగా పీఠంపై స్థిర ప్రతిష్ట చేశారు. దీంతో త్రివేణి సంగమానికి శోభాయమానంగా నిలిచింది. భక్తులు పుష్కర స్నానాలు చేసి దర్శనాలు, సెల్పీలతో పుష్కరాల్లో భక్తులు ప్రణమిల్లారు.
ఊహించని భక్తులు..
సమీక్షల్లో లోకల్ కిందిస్థాయి అధికారులు రోజుకు 10వేల నుంచి 20వేల వరకు భక్తులు వస్తారని ఉన్నతాధికారులు అనుకున్నారు. కానీ కుంభాభిషేకంతో ఫేమస్‌గా మారిన ఆలయానికి దశ తిరిగింది. దీంతో పత్రికలు, టీవీ చానళ్లు, సోషల్ మీడియా వేదికగా నిత్యం ప్రచారం పెరిగింది. దీంతో అధికారులు ఊహించిన దాని కన్నా లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. పార్కింగ్ స్థలాలు సరిపోక ట్రాఫిక్ మినహా ఎలాంటి ఇబ్బందులూ కలుగలేదు.
సరస్వతినది పుష్కరాలతో దేశవ్యాప్తం
ఊహించిన దానికన్నా
అధికంగా భక్తుల రాక
నవరత్నమాల హారతి
పుష్కరాలకే ప్రత్యేకం
సీఎం వరాల జల్లుతో అభివృద్ధిపై ఆశలు
నవరత్నమాల ప్రత్యేకం..
సరస్వతినది పుష్కరాల్లో ప్రత్యేకాకర్షణగా నిలిచిన నవరత్నమాల హారతికి ప్రాధాన్యత సంచరించుకుంది. కాశీకి చెందిన పండితులు వారణాసిలో ఇచ్చే గంగా హారతిని, ప్రభుత్వం తరుఫున ప్రత్యేకంగా ఆహ్వానించారు. కాశీ పండితులు ఆశ్‌తోష్‌శర్మ ఆధ్వర్యంలో ఏడుగురు బృందం తొమ్మిది హారతులు సరస్వతీ మాత విగ్రహం వద్ద 12 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. దీంతో హారతిని తిలకించడానికి భక్తులు రోజూ తరలి వచ్చారు.
సీఎం ప్రకటనతో ఆశలు
ఈనెల 15న పుష్కర స్నానాలు చేసి శ్రీకాళేశ్వర ముక్తీశ్వరుడిని దర్శించుకున్న సీం రేవంత్‌రెడ్డి రూ.200కోట్ల నిధులు రాబోవు గోదావరి పుష్కరాలకు మంజూరు చేస్తానని మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబుకు హామీ ఇచ్చారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, ప్రిన్సిపల్‌సెక్రటరీ శైలజారామయ్యర్‌లను ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆయన ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో కాళేశ్వరం అభివృద్ధి ఆశలు మళ్లీ చిగురించాయని ప్రచారం జరుగుతుంది.