
ప్రజలను చైతన్య పరచాలి
భూపాలపల్లి అర్బన్: మానవ అక్రమ రవాణా అరికట్టడానికి ఉపాధ్యాయులు ప్రజలను చైతన్య పరచాలని జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో భూపాలపల్లి, ములుగు జిల్లాల కస్తూర్బాగాంధీ, ఆదర్శ పాఠశాలలు, అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు ఉపాధ్యాయులకు మానవ అక్రమ రవాణాపై రెండు రోజుల శిక్షణ నిర్వహించారు. మంగళవారం జరిగిన ముగింపు కార్యక్రమానికి డీఈఓ హాజరై మాట్లాడారు. సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు సమాజ భాగస్వాములై మానవ అక్రమ రవాణా అరికట్టడంలో తమ వంతు పాత్ర వహించాలన్నారు. మనుషుల అక్రమ రవాణా నిర్మూలనలో ప్రజలందరూ భాగస్వామి అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చన్నారు. మానవ అక్రమ రవాణా జరిగినప్పుడు టోల్ ఫ్రీ నంబర్లు 1098, 100, 181, 1930 సైబర్ వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బాలిక శిశు అభివృద్ధి అధికారిణి వి.శైలజ, క్వాలిటీ కోఆర్డినేటర్ కాగిత లక్ష్మణ్, ప్రజల స్వచ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్‌లు శ్రీకాంత్, సుప్రియ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.