జనగామ రూరల్: జనగణన ప్రక్రియలో కచ్చితత్వం కీలకమని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. జనగణన 2027 ఫేజ్ 1 గృహాల జాబితా, గృహ గణన నిర్వహణలో భాగంగా నూతనంగా ఎంపికై న టెక్నికల్ అసిస్టెంట్లు, జనాభా లెక్కల ఛార్జ్ క్లర్క్‌లకు ఆదివారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ హాజరై..నూతనంగా ఎంపికై న వారికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణన దేశ అభివృద్ధికి ముఖ్యమైన ప్రాథమిక సమాచార సేకరణ ప్రక్రియ అని తెలిపారు. ప్రతి వివరాన్ని కచ్చితంగా నమోదు చేసే విధానాన్ని, అలాగే టెక్నికల్ అసిస్టెంట్లు సాంకేతిక పరికరాల వినియోగంపై పూర్తి అవగాహన కల్పించాలని, డేటా సేకరణలో పారదర్శకతపై, ఇతర వివరాలపై ప్రతి అంశాన్ని నిశితంగా విని నేర్చుకోవాలని అన్నారు. శిక్షణ కార్యక్రమంలో సీపీఓ చినకోట్యా నాయక్, శిక్షకులు రవి నాయక్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సందీప్ కుమార్ ఝా


