మినరల్ దందా!
లింగాలఘణపురం: గ్రామీణ ప్రాంత ప్రజలంటే ఆరోగ్యంగా ఉంటారనే భావన ఉండేది. స్వచ్ఛమైన గాలి, నీరు, వాతావరణంతో కూడిన పల్లెలు సహితం నేడు కలుషితమౌతున్నాయి. మినరల్ వాటర్ పేరిట వారి ఆరోగ్యాలు అనారోగ్యాలుగా మారుతున్నాయి. ప్రతీ గ్రామంలో పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహణ లేదా స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు నీళ్ల వ్యాపారం కోసం ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్లాంట్ల నిర్వహణపై కనీస అవగాహన లేకపోగా వాటిపై నియంత్రణ చేసే అధికారులే కరువయ్యారు. దీంతో ప్రజల ఆరోగ్యాలపై 80శాతం ప్రభావం చూపే తాగునీటితో వారికి తెలియకుండానే అనారోగ్యాల బారిన పడుతున్నారు.
స్వచ్ఛమైన నీటిలో ఏఏ లవణాలు ఎంత శాతం ఉండాలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్ట్ (బీఐఎస్) నిర్ణయించిన ప్రకారం.. లీటరు నీటిలో ఉండాల్సిన మి.లీ గ్రాముల ప్రకారం (పొటెన్షియల్ ఆఫ్ హైడ్రోజన్) పీహెచ్ 6.5మి.గ్రా–8.5మి.గ్రా, టీడీఎస్ (టోటల్ డిసాల్వ్‌డ్ సాలిడ్స్) అంటే నీటిలో కరిగి ఉండే మొత్తం లవణాల సంఖ్య 150–300, నీటి కాఠిన్యత 300–600, క్యాల్షియం 75–200, క్లోరైడ్ 250, 1000, క్లోరిన్ 0.2–1.0, సల్ఫేట్ 200–400, నైట్రేట్ 45, ఫ్లోరైడ్ 1.0–1.5, ఇనుము 0.3 నుంచి 1.0, మెగ్నీషీయం 30 –100, అల్యూమినీయం 0.03–0.20 మి.గ్రాములు ఉండాలి. ఇవన్నీ సమపాళ్లలో ఉన్నప్పుడే రంగు, రుచి, వాసనలేని స్వచ్ఛమైన నీటిగా పరిగణిస్తారు.
తాగునీటిలో సరైన ప్రమాణాల్లో ఖనిజ లవణాలు లేకపోతే జీర్ణవ్యవస్థ, విరేచనాలు, శిశువులపై, దంతాలు, ఎముకలపై ప్రభావం, మతిమరుపు, గుండె జబ్బులు, మోకాళ్లు, కీళ్లనొప్పుల వంటి వ్యాధుల బారినపడుతుంటారు. ఇదంతా ధీర్ఘకాలికంగా మానవ శరీరాలపై ప్రభావం చూపి ఆరోగ్యాలు క్షీణించడం మొదలౌతుంది. గ్రామాల్లో వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసినప్పుడే అంతా ఇక వాటి నిర్వహణపై కనీస అవగాహన లేకుండా నిర్వహిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా ఆటోమాటిక్ సిస్టమ్ కార్డు పెడితే నీళ్లు రావడం జరుగుతుంది. లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. మండలంలో ఇటీవల ఓ గ్రామంలోని ప్లాంట్ వాటర్‌లో టీడీఎస్ పరీక్షిస్తే 18, 19 చూపించడంతో ఒక్కసారిగా అవాకై ్కయ్యారు. వాటి నియంత్రణపై అటు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు గాని, ఇటు గ్రామస్థాయిలో మరే అధికారికి గాని ఎలాంటి అధికారాలు లేకపోవడంతో నిర్వహణ ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి.
పల్లెల్లో తాగునీటి ప్లాంట్ల మోజు
నిర్వహణ, నియంత్రణ కరువు
ప్రజల ఆరోగ్యాలపై ప్రభావం


