రోడ్డు భద్రతా మాసోత్సవాన్ని విజయవంతం చేయాలి
22న మాక్ డ్రిల్..
జనగామ రూరల్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి మరణాల రేటును నివారించడమే లక్ష్యంగా జనవరి మాసంలో జరిగే జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎస్ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీసీలో జి ల్లా నుంచి కలెక్టర్ రిజ్వాన్ బాషా, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్, ఆర్టీసీ, రవాణా, ఆర్ అండ్ బీ, పోలీ స్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదాలను నివారించడానికి రోడ్డు నిబంధనల విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ రోడ్డు నిబంధనలపై ప్రజ లకు జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలపై అవగాహన కల్పించాలన్నారు. రోడ్డు సేఫ్టీపై ప్రతీ జిల్లాలో ఏర్పడిన రోడ్ సేఫ్టీ కమిటీలు ఈ నెలాఖరులోపు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, దీనిలో కలెక్టర్ చైర్మన్‌గా ఆర్ అండ్ బీ అధికారి కన్వీనర్‌గా ఉంటారన్నారు. అన్ని గ్రామాలు, పాఠశాలల్లో అధి కారులతో కలిసి అవగాహన కల్పించాలని, మంత్రులు, ఎమ్మెల్యేలు అధికారులు, సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు ఇందులో పాల్గొనేలా అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు.
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవాలనే అంశాలపై ఈ నెల 22న జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టనున్న టేబుల్ టాప్ (మాక్ డ్రిల్) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రి జ్వాన్ బాషా సంబంధిత శాఖ అధికారులను శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు. వరదలు, పారిశ్రామిక ప్రమాదాలు, విపత్తులు సంభవించిన సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం నివారించేందుకు చేపట్టాల్సిన తక్షణ చర్యలపై మాక్ డ్రిల్‌లో పక్కాగా నిర్వహించాలన్నారు. ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు తక్షణ సహాయక చర్యలు చేపట్టడం, అంబులెన్సులు, లైఫ్ బోట్స్, లైఫ్ జాకెట్స్ అందుబాటులో ఉంచడం, రెస్క్యూ టీంలు, మెడికల్ టీంలను ఏర్పాటు చేయడం, ఇతర సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సి ఉంటుందన్నారు.
వీసీలో రవాణా శాఖ మంత్రి
పొన్నం ప్రభాకర్


