బీఆర్‌ఎస్‌పై ప్రజల విశ్వాసం
● జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
జనగామ: పంచాయతీ పోరులో గ్రామస్థాయిలో బీఆర్‌ఎస్‌పై ప్రజలకు ఉన్న విశ్వాసమే సర్పంచ్, వార్డు సభ్యుల విజయంలో స్పష్టంగా కనపడిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన సన్మాన కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన నియోజకవర్గంలోని సర్పంచ్, వార్డు సభ్యులతో పాటు స్వతంత్రులుగా విజయం సాధించిన వారు, 2500 మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. వీరంతా ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా, అనంతరం ఎమ్మెల్యే నూతన సర్పంచ్, వార్డు సభ్యులను ఘనంగా సత్కరించారు. అంతకుముందు నియోజకవర్గంలో స్వతంత్రులుగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు బీఆర్‌ఎస్‌లో చేరగా, ఎమ్మెల్యే వారిని స్వాగతించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా విజయం సాధించిన ప్రజాప్రతినిధులు సైతం అభివృద్ధి లక్ష్యంగా బీఆర్‌ఎస్‌తో కలిసి రావడం సంతోషకరమన్నారు. సర్పంచ్, వార్డు సభ్యులు, ఇతర ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకుని నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యమని స్పష్టం చేశారు.


