మొదటి విడత ప్రచారానికి తెర!
● హోరాహోరీగా ర్యాలీలు, ఊరేగింపులు
● 110 జీపీలు..బరిలో
351 సర్పంచ్ అభ్యర్థులు
● 10 మంది ఏకగ్రీవం
● నేటి నుంచి మద్యం దుకాణాల బంద్
జనగామ: స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో గ్రామపంచాయతీ ఎన్నికల జోష్ తారాస్థాయికి చేరుకుంది. లింగాలఘణపురం, రఘునాథపల్లి, చిల్పూరు, జఫర్‌గఢ్, స్టేషన్‌ఘన్‌పూర్ ఐదు మండలాల్లో 12రోజులుగా హోరెత్తిన ప్రచారం ఈనెల 9న (మంగళవారం) సాయంత్రం 5 గంటలతో తెరపడనుంది. 110 పంచాయతీల్లో 351 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండడంతో గ్రామాల్లో ఉత్కంఠ నెలకొంది. చివరి గడియలో ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు గ్రామాలను చుట్టేస్తూ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నారు. ఇదే సమయంలో అధికారులు భద్రత, పోలింగ్ ఏర్పాట్లను కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్నారు. ఎన్నికల వేడి పెరిగిన నేపథ్యంలో 16 వైన్‌న్స్ సీజ్ చేయడానికి ఎకై ్సజ్ శాఖ సిద్ధమైంది. అయితే గ్రామాల్లో రహస్యంగా మద్యం డంపింగ్, స్టాక్ తరలింపుతో పోరు మరింత వేడెక్కింది.
నేటితో ముగింపు..
మంగళవారం సాయంత్రం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచార నిషేధం అమల్లోకి రానుండడంతో, అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, ప్రముఖులు తిరుగుతూ అభివృద్ధి హామీలు ఇస్తున్నారు. అధికార, ప్రతిపక్షాలతో పాటు స్వతంత్రులు, వామపక్షాలు కూడా ప్రజల వద్దకు వెళ్లి తమ తరఫున నిలిచిన అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రతిచోట పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తోంది. స్టేషన్‌ఘన్‌పూర్, జఫర్‌గఢ్‌లో ఒక్కటి, చిల్పూరులో 3, రఘునాథపల్లిలో ఐదుగురు మొత్తంగా 10 మంది సర్పంచ్ అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, అత్యధికంగా రఘునాథపల్లి మండలంలోనే 107 మంది పోటీ పడుతుండగా, అత్యల్పంగా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలో 48 మంది నువ్వా నేనా అన్నట్టుగా నోటీ పడుతున్నారు.
నేడు వైన్స్‌లు బంద్
ప్రచారానికి ముగింపు పలుకుతుండడంతో నియోజకవర్గంలోని 16 మద్యం దుకాణాలను సీజ్ చేయడానికి ఎకై ్సజ్ శాఖ అధికారులు సిద్ధమయ్యారు. డిసెంబర్ 11న పోలింగ్, కౌంటింగ్ పూర్తై, విజేతలకు ధ్రువపత్రాలు అందించే వరకూ వైన్‌న్స్‌లు మూసిఉంచాలి. ప్రచార సమయంలో చివరి రెండు రోజులు కీలకం కావడంతో, కొన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున మద్యం డంపింగ్ చేశారు. క్వార్టర్లు, ఆఫ్, ఫుల్ బాటిళ్లు భారీగా స్టాక్ చేసుకుని, పోలింగ్‌కు ముందు రోజు ఓటర్లకు పంపిణీ చేసేందుకు రహస్య ప్రదేశాలకు తరలి స్తున్నట్లు సమాచారం. మూడో కంటికి కనిపించకుండా ఈ స్టాక్‌ని రోజువారీగా లోపలికి పంపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల హడావుడి, రాజకీయ ఉత్కంఠ, చివరి గంటల్లో అభ్యర్థుల పరుగులతో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో పంచాయతీ పోరు పీక్ స్టేజీకి చేరుకుంది.


