వందశాతం ఓటింగ్ సాధ్యమే
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ: జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటు విలువైనదని, అందరూ సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్, ఎన్నికల అధికారి రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. సోమవారం కలెక్టరేట్ నుంచి ఆయన మాట్లాడారు.. గతంలో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిధిలో 90.14 శాతం పోలింగ్ నమోదుకాగా, ఈసారి వంద శాతం ఓటింగ్ నమోదయ్యేలా ప్రజల్లో అవగాహన పెంచుతున్నామన్నారు. ఓటు వేయడానికి వెళ్లేవారు 18 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి చూపిస్తే సరిపోతుందన్నారు. ఓటరు స్లిప్ కూడా అంతే ముఖ్యమైనప్పటికీ, కేవలం పోలింగ్ స్టేషన్ వివరాలు మాత్రమే చూపిస్తుందన్నారు. అందుకే, అధికారిక వెబ్ tsec.gov.in నుంచి ఓటరు స్లిప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
ఎన్నికల ప్రక్రియ జాగ్రత్తగా నిర్వహించాలి
పాలకుర్తి టౌన్: ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రతీ ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు అనుగుణంగా జరగాలని ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నామినేషన్ స్క్రూట్నీ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వర్కల వేదంతి, తహసీల్దార్ సూత్రం సర్వంతి, ఏంపీఓ హరినాథ్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏర్పాట్లపై సమీక్ష..
దేవరుప్పుల: మండల పరిషత్ కార్యాలయంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, అభ్యర్థుల ఖరారు, గుర్తులు కేటాయింపు, అవగాహన సదస్సు, ఎన్నికల నిర్వహణ, సామగ్రి పంపిణీ వంటి ఏర్పాట్లపై కలెక్టర్ రిజ్వాన్ బాషా సమీక్షించారు. కార్యక్రమంలో ఎన్నికల సహాయ జిల్లా అధికారి మేనక పౌడేల్, తహసీల్దార్ ఆడెపు అండాలు, సూపరింటెండెంట్ పుష్పలత, ఆర్‌ఐ రాజు తదితరులు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి..
కొడకండ్ల: గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను పకడ్బందిగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయాన్ని కలెక్టర్ తనిఖీ చేసి ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులకు ఆదేశాలిచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రమోహన్, ఎంపీడీఓ నాగశేషాద్రిసూరి తదితరులు పాల్గొన్నారు.


