బంధువులే భల్లాలదేవుళ్లు
పక్కింటి గొడవలే ఎక్కువ..
పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యర్థులంతా పక్కింటివారు, కావాల్సినవాళ్లే
జనగామ: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పెద్ద పండుగను తలపిస్తున్నాయి. గల్లీల్లో అభ్యర్థుల జోరు ప్రచారాలతో సందడి నెలకొంది. పార్టీల ప్రచారం ఇలా ఉంటే.. సర్పంచ్ ఎలక్షన్లు పక్కింటి వాళ్లను ప్రత్యర్థులుగా మారుస్తున్నాయి. పెదనాన్న కొడుకు, తోటి కోడళ్లు, బాబాయ్, అబ్బాయ్‌లు వేరు వేరు పార్టీల పక్షాన బరిలో నిలబడటం గ్రామాల్లో చర్చకు దారితీస్తోంది. బాహుబలి సినిమాలో రాజ్యాధికారం కోసం విలన్ భల్లాలదేవుడు, నమ్మించి కుట్ర చేసే కట్టప్పలు ఉన్నట్లే.. పంచాయతీ ఎన్నికల్లో పక్కింటివారు, బంధువుల్లోనూ భల్లాలదేవుళ్లు, కట్టప్పలు ఉంటున్నారు. బంధాలు, బంధుత్వాలతో దశాబ్దాలుగా కలిసి జీవించిన పక్కింటి అనుబంధాలు ఎన్నికల వేళ ఒక్కసారిగా గీత దాటిస్తున్నాయి. బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థి ఓటు అడుగుతున్నారు. కడుపులో తలపెడుతూ ‘అన్నా నీ ఓటు వేసి గెలిపిస్తే రుణ పడి ఉంటా..’నని ఎవరికి వారే బతిమిలాడుతున్నారు. ఒకరికి ఓటు వేస్తే ఇంకొకరి మనసు నొప్పించకపోవడమెలా అనే సందిగ్ధతలో చాలా మంది ఓటర్లు ఊగిసలాటలో ఉన్నారు.
పంచాయతీ ఎన్నికలు సీరియల్ కథను తలపిస్తున్నాయి. ఓటర్ల నిత్యకృత్యాలు పూర్తయ్యేలోపే, అభ్యర్థుల బృందాలు ఫ్లకార్డులు పెట్టుకుని ఇంటి ముందు ప్రత్యక్షమవుతున్నారు. ప్రచారంలో ప్రత్యర్థులు ఎదురుపడే సమయంలో నినాదాలతో హోరెత్తిస్తున్నారు. యువకులు, మహిళలు ఈసారి ప్రచారంలో ముందు వరుసలో ఉన్నారు. పాలకేంద్రాలు, టీ స్టాల్స్, రచ్చబండ వద్ద సర్పంచ్, వార్డు సభ్యులుగా ఎవరు గెలుస్తారన్న చర్చ ఎగ్జిట్ పోల్స్‌ను మించి ఉంటుంది. నిజంగా గ్రామానికి పని చేస్తారన్న ప్రశ్నే మెజార్టీ ఓటర్ల ద్వారా వినిపిస్తోంది. పచ్చిక పొలాల్లో పని చేస్తూ రైతులు చెప్పే మాటల్లో కూడా అదే భావన. వారు అభ్యర్థుల వ్యక్తిగత నడవడిక, మంచి చెడు, గతంలో చేసిన పనుల గురించి సరిచూసి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎలక్షన్లలో స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున బరిలో నిలువడంతో స్థానిక సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. పలుచోట్ల పార్టీ అభ్యర్థులకే కాకుండా స్థానికంగా మంచి పేరున్న స్వతంత్రులకూ అనుకూలంగా మారిపోతుంది. పార్టీ కంటే వ్యక్తి అనే భావన ఈసారి గ్రామాల్లో బలంగా వినిపిస్తోంది. అభ్యర్థుల వ్యక్తిగత వ్యవహారశైలిపై ఓటర్ల నిర్ణయంపై భారీ ప్రభావం చూపిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాగునీరు, రోడ్లు, స్ట్రీట్ లైట్లు, డ్రెయినేజీల నిర్మాణం ఇలా ప్రతి గ్రామంలో ప్రజల సమస్యలు వేరైనా పరిష్కారం చూపగల నాయకుడే కావాలన్న అభిలాష అన్ని మండలాల్లో ఒకేలా వినిపిస్తోంది. స్టేషర్‌ఘన్‌పూర్ ప్రచారానికి మూడు రోజులు మిగిలి ఉండగా, జనగామ నియోజకవర్గంలో ప్రచారంలో వేగం పుంజుకుంది. ఎవరు ఎక్కడ గెలుస్తారనే విషయం కొన్ని రోజుల్లో తేలిపోనుంది.
ప్రధాన, ప్రతిపక్ష, ఇతర పార్టీలతో పాటు స్వతంత్రులు ఉదయం 6 గంటల వరకే రోడ్డెక్కేస్తున్నారు. పార్టీల కేడర్, వెంట వచ్చే అనుచరులను అభ్యర్థులు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ప్రచారానికి వెళ్లే సమయంలో ‘అన్నా టిఫిన్లు చేశారా..’ అంటూ ఫోన్లు చేసి ఆప్యాయంగా పలకరిస్తున్నారు. రోజువారీగా విందు పార్టీలకు కొదవ లేదు. బెల్ట్ దుకాణాదారులు లక్షల రూపాయల సరుకును స్టాక్ ఉంచుతున్నారు. ఆఫీసర్ ఛాయిస్ నుంచి బ్లాక్‌డాగ్ వరకు కొరత లేకుండా చూసుకుంటున్నారు.
సర్పంచ్ ఎన్నికల హడావుడి పక్కింటి వారితో చిన్నపాటి గొడవలకు దారి తీస్తోంది. అలా వచ్చి ఇలా వెళ్లి పోయే ఎలక్షన్లతో బంధుత్వం, స్నేహం మధ్య దూరం రాకూడదని పెద్ద మనుషులు మధ్యవర్తిత్వం చేసి కలిసి పోయేలా చేస్తున్నారు. మొత్తం మీద జనగామలో ఈసారి పంచాయతీ ఎన్నికలు రాజకీయ పోరుగా మాత్రమే కాకుండా బంధుత్వాలు, పక్కింటి అనుబంధాలకు దూరాన్ని పెంచేలా చేస్తోంది.
పోటీలో ఎక్కువగా అన్నదమ్ముళ్లు,
తోటికోడళ్లు, బాబాయ్, అబ్బాయ్‌లే..
ఎక్కడా చూసినా ఎవరూ
గెలుస్తారనే చర్చే
గ్రామాల్లో హోరెత్తుతున్న అభ్యర్థుల ప్రచారం
బంధువులే భల్లాలదేవుళ్లు


