నేడు ఉచిత స్వర్ణప్రాశన
జనగామ : పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులోని ఆయుర్వేద పంచకర్మ వెల్‌నెస్ సెంటర్‌లో ఈనెల 8న (సోమవారం) పుష్యమి నక్షత్రం పురస్కరించుకుని ఉచిత స్వర్ణప్రాశన కార్యక్రమం ఉంటుందని డాక్టర్ అంజిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, 6 నెలల నుంచి 16 సంవత్సరాల వయస్సు వారికి స్వర్ణప్రాశన వేస్తామన్నారు. వివరాల కోసం 9000097686 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
ఘనంగా స్వామివారి
కల్యాణోత్సవం
నర్మెట : మండల కేంద్రంలోని కాకతీయుల కాలంనాటి అతిపురాతన వేంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి వార్షిక కల్యాణోత్సవాన్ని ఆలయ పూజారి పార్నంది సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. గణపతి పూజతో ప్రారంభమైన క్రతువు తలంబ్రాలతో ఘనంగా ముగిసింది. అనంతరం స్వామివారికి, ఉభయ దేవేరులకు ఒడిబియ్యం పోసి కట్నకానుకలు సమర్పించుకున్న మహిళలు, భక్తులు మహాన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కల్యాణంలో ఇమ్మడి సరిత శ్రీనివాస్‌రెడ్డి, చింతకింది హేమలతా రవీందర్, రంగరాజు సుమబాల విద్యాసాగర్‌రావు, రంగరాజు సునిత వెంకటరమణారావు, గోపగోని జ్యోతివిజయ్‌కుమార్, దన్నారపు శోభా దేవి మురళి, గోపగోని లలిత శ్రీధర్, చిర్రవెంకట్ రెడ్డి, గోపగోని రేవంత్ ఆదిత్య, చంద్రకాంత్, మడికొండ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
శాంతిభద్రతలకు
విఘాతం కల్గించొద్దు
జఫర్‌గఢ్: ఎన్నికల్లో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కల్గించవద్దని వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య కోరారు. మండల కేంద్రంలోని గాంధీ సెంటర్‌లో ఎన్నికలపై ఏసీపీ అంబటి నర్సయ్య ఆదివారం ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగాలన్నారు. ఎన్నికల సమయంలో ఎలాంటి గొడవలకు పాల్పడకూడదన్నారు. ఏమాత్రం శాంతిభద్రతలకు విఘాతం కల్గించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఓటర్లు ఏలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్ధన్నపేట సీఐ శ్రీనివాసరావు, ఎస్సై రామారావుతో పాటు పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎన్నికల్లో ప్రలోభాలకు గురికావొద్దు
స్టేషన్‌ఘన్‌పూర్: ఎన్నికల సమయంలో డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు గురికావద్దని, గ్రామ అభివృద్ధికి పాటుపడే వ్యక్తిని ఎన్నుకోవాలని స్థానిక ప్రభుత్వాల సాధికారత వేదిక రాష్ట్ర కన్వీనర్ బండారు రామ్మోహన్‌రావు అన్నారు. మండలంలోని సముద్రాల గ్రామంలో ఎన్నికల నిఘా వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఓటరు అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. రాష్ట్రంలో మూడు విడతలుగా జరుగుతున్న ఎన్నికల్లో ఇప్పటికే ఏకగ్రీవాల పేరిట వేలం పాట రాజకీయాలు కొనసాగాయని, బలవంతపు ఏకగ్రీవాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎన్నికల నిఘావేదిక ఉమ్మడి జిల్లా సమన్వయ కర్త ప్రశాంత్‌కుమార్, ఘన్‌పూర్ నియోజకవర్గ ఎన్నికల నిఘావేదిక కన్వీనర్ కుంభం విజయ్, శ్రీనివాస్‌రెడ్డి, ప్రకాశ్, శ్రావ్య, నిశ్చిత్, రాజు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో
హేమాచలుడికి పూజలు
మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీహేమాచలక్షేత్రానికి భక్తులు ఆదివారం భారీగా తరలివచ్చి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. స్వయంభు లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మంది తరలివచ్చి ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం పూజలు నిర్వహించారు.
నేడు ఉచిత స్వర్ణప్రాశన
నేడు ఉచిత స్వర్ణప్రాశన


