మేడారంలో భక్తుల కోలాహలం
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్ వాహనాల్లో తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఎత్తు బంగారం, కానుకలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజుకు పూజలు చేశారు. సుమారు 20వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు మేడారం, చిలకలగుట్ట, శివరాంసాగర్ పరిసరాల ప్రాంతాల్లో విడిది చేసి వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు.
భక్తులకు తప్పని తిప్పలు
మేడారంలో రోడ్ల నిర్మాణం పనులు జోరుగా సాగుతుండడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. అమ్మవార్ల గద్దెల వద్దకు వెళ్లే పలు దారుల రోడ్ల నిర్మాణం పనులు చేస్తుండగా అక్కడికి ఎలా చేరుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. జంపన్నవాగు నుంచి బస్టాండ్ వరకు రోడ్డు విస్తరణ, జంపన్నవాగు నుంచి గద్దెలకు వచ్చే దారిలో నీడ చెట్ల నుంచి హరితహోటల్ దారిలో, ఆర్టీసీ బస్డాండ్ భక్తుల క్యూలైన్ దారిలో రోడ్ల విస్తర్ణం పనులు సాగుతున్నాయి. హరితహోటల్ దారిలో కూడా రోడ్డు విస్తరణ పనులు సాగుతుండగా భక్తులు ఇబ్బందులు పడ్డారు.
భారీగా తరలివచ్చిన భక్తజనం
వనదేవతలకు మొక్కుల చెల్లింపు
రోడ్ల నిర్మాణ పనులతో భక్తుల ఇక్కట్లు
మేడారంలో భక్తుల కోలాహలం


