ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
జనగామ రూరల్: గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా సూచించారు. శనివారం కలెక్టరేట్‌లోని కార్యాలయంలో మైక్రో అబ్జర్వర్లకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. మైక్రో అబ్జర్వర్లు తమ చెక్‌లిస్ట్‌లో ప్రతీ అంశంపై ‘అవును/కాదు’గా నమోదు చేసి, గమనించిన లోపాలు లేదా సంఘటనలను ప్రత్యేక రిపోర్ట్‌లో పొందుపరచాలన్నారు. ఫలితాల ప్రకటన, ఎన్నిక సర్టిఫికెట్ జారీ సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. ఎన్నికల సంఘం సూచనలు తప్పకుండా పాటించాలన్నారు. బ్యాలెట్ బాక్స్ పరిశీలన, సీరియల్ నంబర్ల నమోదు, పోలింగ్ కేంద్ర ప్రవేశ నియంత్రణ, ఓటర్ల గుర్తింపు, ఇండిలేబుల్ సిరా గుర్తు వేయడం, ఓటర్ల నమోదు ప్రక్రియ, దివ్యాంగుల సహాయం, పోలింగ్ కేంద్రం చుట్టూ ప్రచారం లేదా ఒత్తిడి పరిశీలన తదితర అంశాలపై మాస్టర్ ట్రైనర్ మెరుగు రామరాజు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, జెడ్పీ సీఈఓ మాధురిషా, ఇన్‌చార్జ్ డీపీఓ వసంత పాల్గొన్నారు. అలాగే జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా తెలిపారు. ఏకగ్రీవ గ్రామపంచాయతీల్లోనూ ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయన్నారు.
పొరపాట్లకు తావివ్వొద్దు
లింగాలఘణపురం: ఎన్నికల విధుల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం మండలంలోని బండ్లగూడెం రైతువేదికలో స్టేజ్–2 ప్రిసైడింగ్ అధికారులకు జరుగుతున్న శిక్షణ కార్యక్రమాన్ని సందర్శించి మా ట్లాడారు. ఎన్నికల ముందు సామగ్రిని సరిచూసుకోవడం, బ్యాలెట్ పేపర్ చెక్ చేసుకోవడం తదితర ప్రతీ అంశాన్ని పరిశీలించి పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ శివశంకర్‌రెడ్డి, మాస్టర్ ట్రైనర్స్ కోటీ, శ్యామ్‌మోహన్, రాఘవులు, హరిప్రసాద్, రాజశంకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
జనగామ రూరల్: ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్యసేవలందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. శనివారం వైద్యాధికారి మల్లికార్జునరావుతో కలిసి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిత్యం సమీక్షలు జరుపుతూ మలేరియా, డెంగీ నియంత్రణ చర్యలు చేపట్టాలన్నారు.
ఎన్నికల పరిశీలకుడు రవికిరణ్, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్‌బాషా


