ఎన్నికల విధులు అత్యంత కీలకం
● స్టేజ్–2 ఆర్వోల శిక్షణలో
కలెక్టర్ రిజ్వాన్ బాషా
జనగామ: పంచాయతీ ఎన్నికల్లో విధుల నిర్వహణ అత్యంత కీలకమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి స్టేజ్–2 ఆర్వోలకు మాస్టర్ ట్రైనర్లు మెరుగు రామరాజు, నరసింహమూర్తి, సురేందర్‌రెడ్డి, రాజేందర్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ..ఓటరు లిస్ట్‌లో పేరు ఉన్నవారు మాత్రమే ఓటు వేసేలా చూడాలన్నారు. బరిలో ఉన్న అభ్యర్థుల రోజువారి ఎన్నికల ఖర్చు వివరాలను తనిఖీ చేసి, ఖర్చు వివరాలు సమర్పించడంలో విఫలమైనట్లయితే, వారికి నోటీసులు జారీ చేయలన్నారు. శిక్షణలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, జెడ్పీ సీఈఓ మాధురిషా, డీఆర్డీఓ వసంత తదితరులు ఉన్నారు.
నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యం
జనగామ రూరల్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ చెప్పారు. జనగామ టౌన్ 2 సెక్షన్ పరిధిలోని కలెక్టరేట్ సబ్ స్టేషన్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు 5ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఈ ఇంజనీర్ సంపత్‌రెడ్డి, ఆపరేషన్ డీఈ లక్ష్మీ నారాయణరెడ్డి, డీఈ టెక్నికల్ గణేశ్, ఏడీఈ వేణుగోపాల్, ఏడీఈ టీఆర్‌ఈ శ్రీధర్, టౌన్ వన్ ఏఈ సౌమ్య, చంద్రమోహన్ పాల్గొన్నారు.
అద్భుత శక్తికి ప్రతీక దివ్యాంగులు
అద్భుతమైన శక్తికి, సృజనాత్మకతకు ప్రతీక దివ్యాంగులని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కొనియాడారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని జూబ్లీ ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు..జిల్లా సదరం క్యాంపునకు ఇబ్బందులు లేకుండా అన్ని మౌలిక సదుపాయాలతో రేడియాలజీ హబ్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. మహిళా దివ్యాంగుల సంఘాలు కూడా ఏర్పాటు అయ్యాయన్నారు. ఈసందర్భంగా నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రోత్సాహం, సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సంక్షేమశాఖ అధికారి కోదండరాములు, దివ్యాంగుల సంఘాల నాయకులు పాముకుట్ల చందు పంతులు, ప్రభాకర్, మేకల సమ్మయ్య, బొట్ల సుమతి, మట్టి కిషన్, తాళ్లపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


