మహిళల ఆర్థిక అభ్యున్నతే ప్రభుత్వ లక్ష్యం
● కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా
జనగామ రూరల్: మహిళల ఆర్థిక అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరా మహిళాశక్తి పథకంలో భాగంగా ఏర్పాటు చేసిన వనిత టీస్టాల్‌లను జిల్లాలో స్వయం సహాయక సభ్యులు విజయవంతంగా నిర్వహిస్తున్నారని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. సోమవారం జనగామ తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన వనితా టీస్టాల్‌ను, అలాగే కలెక్టరేట్ వద్ద మిల్క్‌పార్లర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణప్రాంత మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడమే లక్ష్యంగా ప్రభుత్వం చేయూత అందిస్తోందన్నారు. వడ్లకొండ గ్రామంలోని ఓంసాయి సంఘ సభ్యురాలు స్రవంతి రూ.2.50లక్షలతో వనితా టీస్టాల్‌ను అలాగే చీటకోడూరులోని కస్తూరి స్వయం సహాయక సభ్యురాలు విజయలక్ష్మి రూ.2.50 లక్షల బ్యాంకు లింకేజీ రుణాలతో మిల్క్‌పార్లర్‌ను ఏర్పాటు చేసుకున్నారు.
కార్యక్రమంలో డీఆర్డీఓ వసంత, అడిషనల్ డీఆర్డీఓ, డీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.
రైతులు అప్రమత్తంగా ఉండాలి..
జనగామ: రాష్ట్రంపై మొంథా తుఫాను ప్రభావంతో రాబోయే మూడు నుంచి నాలుగు రోజుల పాటు వర్షాలు, ఈదురుగాలులు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా సోమవారం రైతులకు కీలక సూచనలు జారీ చేశారు. రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని కోత, రవాణా పనులను తాత్కాలికంగా 3, 4 రోజుల పాటు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోసిన పంటలను వర్షం బారిన పడకుండా సురక్షిత ప్రదేశాల్లో, గిడ్డంగుల్లో నిల్వ చేయాలని సూచించారు. తుఫాను సమయంలో చెట్లు, విద్యుత్ తీగలు, నీరు నిల్వ ఉన్న ప్రదేశాల వద్దకు వెళ్లరాదని సూచించారు.


