రూ.18.70 కోట్లు
పట్టణ ప్రజలకు ఊరట
జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి యూఐడీ నిధులు
జనగామ: జనగామ పురపాలిక అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ (యూఐడీ)లో భాగంగా ప్రభుత్వం మున్సిపాలిటీకి రూ.18.70 కోట్లను కేటాయించింది. ఈ నిధులతో పట్టణంలోని 30 వార్డుల పరిధిలో సీసీ రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణంతో పాటు 14వ వార్డులో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదురుగా ఉన్న చిల్డ్రన్ పార్కు పునర్నిర్మాణం చేపట్టనున్నారు. జనగామ జిల్లా కేంద్రం మున్సిపల్ అభివృద్ధికి మరో అడుగు పడింది. 30 వార్డులు, సుమారు 80 వేల పైచిలుకు జనాభాతో 19.1 కిలో మీటర్ల మేర విస్తరించి ఉంది. 108 కిలో మీటర్ల డ్రెయినేజీ, 155 కిలో మీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణంతో పట్టణం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుంది. బాలాజీనగర్, కుర్మవాడ, సూర్యాపేట రోడ్డు, బాణాపురం, గిర్నిగడ్డలోని పలు ప్రాంతా లు, జీఎంఆర్ కాలనీ, జ్యోతినగర్ (పలు ఏరియాలు), వికాస్‌నగర్ తదితర ప్రాంతాల్లో సీసీరోడ్లతో పాటు డ్రెయినేజీల నిర్మాణం చేపట్టాల్సి ఉంది.
గత కొంతకాలంగా మున్సిపాలిటీ అధికారులు పట్టణ అవసరాల దృష్ట్యా అభివృద్ధి ప్రతిపాదనలు వివరాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన ప్రభుత్వం తాజాగా నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 30 వార్డుల పరిధిలో 10,691 మీటర్ల సీసీరోడ్లు, 10,853 మీటర్ల డ్రెయినేజీ, చిల్డ్రన్ పార్కు పునరుద్ధరణకు రూ.18.70 కోట్లు మంజూరు చేసింది. ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్‌కు సంబంధించి ప్రకటన చేయగా, నిధులు పురపాలిక ఖాతాలో జమ కావాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఇందుకు సంబంధించిన పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
అభివృద్ధి పథకాల అమలులో కాంట్రాక్టర్లకు నిధుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడంతో టెండర్లకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పురపాలికకు వచ్చే నిధులతో చేపట్టబో యే అభివృద్ధి పనులకు టెండర్లు పిలవాల్సి ఉంటుంది. గతంలో మున్సిపాలిటీల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినప్పటికీ ఏ ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రాని పరిస్థితులు విధితమే. ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ శాఖలో ఇలాంటి పరిస్థితి నెలకొంది. తాజాగా నిధులు అందుబాటులోకి రాక, కాంట్రాక్టర్లు స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన అంశంగా మారింది.
జనగామ మున్సిపాలిటీకి రాబోయే నిధులు పట్టణ భవిష్యత్‌కు పునాది వేయనుంది. మౌలిక వసతుల విస్తరణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. చిల్డ్రన్ పార్క్ అభివృద్ధితో పిల్లలకు వినోదం, పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుంది. ప్రభుత్వం ఇచ్చిన ఈ అవకాశాన్ని సమర్థంగా వినియోగించుకుంటే జనగామ పట్టణ రూపు మార్చుకునే దిశగా అడుగులు వేస్తుందనే అభిప్రాయం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు.
పట్టణంలోని శివారు ప్రాంతాల్లో ఇప్పటికీ సీసీ రోడ్లు, డ్రెయినేజీలు లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్లపై మురుగునీరు పారడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నిధుల మంజూరుతో ఆ సమస్యలకు చెక్ పడే అవకాశముంది. డ్రెయినేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం పూర్తయితే పరిశుభ్రత, ఆరోగ్య పరిరక్షణకు ఉపహరించడంతో పాటు దోమల స్వైర విహారానికి చెక్ పెట్టొచ్చు.
సీసీ రోడ్లు, డ్రెయినేజీలు,
చిల్డ్రన్ పార్కు నిర్మాణం
మారనున్న పట్టణ రూపురేఖలు


