అటకెక్కిన సర్దుబాటు
విద్యార్థుల
భవిష్యత్తుపై నిర్లక్ష్యం
ముందుకు కదలని ఫైల్
జనగామ: జిల్లాలో టీచర్ల సర్దుబాటు ప్రక్రియ అటకెక్కింది. గత నెల 4వ తేదీకి పూర్తి కావాల్సిన సర్దుబాటు, అక్టోబర్ 23వ తేదీ దాటినా తుది దశకు రాలేదు. విద్యాశాఖలో ఇందుకు సంబంధించిన ఫైల్ ముందుకు కదలకపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారింది. మొదటి విడత సర్దుబాటులో పలువురు ఎంఈఓల అలసత్వంపై సర్వత్రా విమర్శలు రావడంతో తాత్కాలికంగా బ్రేక్ వేశారు.
సబ్జెక్టు టీచర్ల కొరత..
జిల్లాలోని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు టీచర్ల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్ వంటి కీలక సబ్జెక్టుల బోధనపై ప్రభావం చూపుతోంది. పదో తరగతి విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించాలన్న కలెక్టర్ లక్ష్యంతో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ, బోధకుల కొరతతో ఆ తరగతులు సరిగా సాగడం లేదు. మరోవైపు, ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ల కొరత కారణంగా విద్యార్థుల ప్రాథమికంగా నేర్చుకునే స్థాయిపై ప్రతికూల ప్రభావం పడుతోంది. మొదటి విడత సర్దుబాటులో జరిగిన అక్రమాలపై ఇప్పటికే అనేక ఆరోపణలు, విమర్శలు వెలువడిన విషయం తెలిసిందే. దీంతో విద్యాశాఖ రెండో విడతలో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆదేశించినప్పటికీ, ఈసారి కూడా పలువురు ఎంఈఓల నిర్లక్ష్యం కారణంగా సర్దుబాటు ప్రక్రియ ముందుకు సాగడం లేదనే ప్రచారం టీచర్ల ద్వారా వినిపిస్తోంది. సర్దుబాటులో జరుగుతున్న జాప్యాన్ని వ్యతిరేకిస్తూ అనేక ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు కలెక్టర్, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వినతులు సమర్పించినప్పటికీ ఫలితం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు ప్రారంభం కాబోతున్న సమయంలో విద్యార్థులపై సర్దుబాటు ఆలస్యం ప్రతికూల ప్రభావం ఎంతోకొంత ఉండక తప్పదని ఉపాధ్యాయులు అంటున్నారు. టీచర్ల కొరతను భర్తీ చేయక పోవడంతో పాఠశాలల్లో బోధనా తరగతులకు కార్యక్రమాలు సక్రమంగా సాగకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సర్దుబాటుపై ఉన్నతాధికారుల నిర్లక్ష్య ధోరణిపై జిల్లాలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటం క్షమార్హం కాదని ప్రజలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియ త్వరితగతిన పూర్తిచేసి, టీచర్లను పాఠశాలలకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల విద్యాహక్కు, భవిష్యత్తు భద్రత కోసం టీచర్ల సర్దుబాటు వెంటనే పూర్తి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. అధికార యంత్రాంగం మేల్కొనకపోతే రాబోయే విద్యా సంవత్సరం మరింత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఆగమ్యగోచరంగా పాఠశాల విద్యార్థుల భవిష్యత్తు
నేటి నుంచి ఎస్‌ఏ–1 పరీక్షలు
బడులు ప్రారంభమై 5 నెలలు
గాడితప్పిన విద్యాశాఖ పనితీరు
డీఈఓను తప్పుదారి పట్టిస్తున్నారా..!


