
ధాన్యం కొనుగోళ్లకు ప్రత్యేక కార్యాచరణ
జనగామ రూరల్: ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రతీ సీజన్‌లో జిల్లా యంత్రాంగం గొప్పగా కృషి చేస్తోందని, అదే స్ఫూర్తితో వానాకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు పక్కాగా కార్యాచరణ రూపొందించినట్లు కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నదాతలు ఎంతో శ్రమించి పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కేంద్రాలకు వచ్చే చివరి గింజను కొనుగోలు చేసేందుకు జిల్లాలో 287 కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటివరకు జరిగిన వరి కోతల ఆధారంగా కొనుగోలు కోసం వచ్చే ధాన్యానికి అనుగుణంగా 99 కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాగా మిగతావి కూడా అతి త్వరగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఇప్పటివరకు 592 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని వాటికి సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం పూర్తయిందన్నారు. ప్రతీ కేంద్రానికి జీపీఓలు అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో వివిధ శాఖల అధికారులను నియమించామన్నారు. గన్నీబ్యాగులు, తేమ కొలిచే యంత్రాలు, తూకం యంత్రాలు, రైతులకు కనీసం మౌలిక వసతులు, లోడింగ్ అన్ లోడింగ్‌లో జాప్యం రాకుండా తగు రవాణా సదుపాయాలు ప్రతీ కొనుగోలు కేంద్రంలో అందుబాటులో ఉండే విధంగా అధికారులను ఆదేశించామన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా