
కొత్త కాంతులు..
టపాసులు కొంటున్న ప్రజలు
పట్టణంలో పూలు కొనుగోలు చేస్తున్న యువతులు
జనగామ: కార్తీక మాసం ప్రారంభంలో వచ్చే దీపావళి వెలుగుల వేడుక. చీకట్లను తొలగించే దివ్వెల పండుగ అంటే చిన్నా,పెద్దా అందరికీ సంతోషమే. మిరుమిట్లు గొలిపే కాకరఒత్తులు, భూచక్రాలు, తారాజువ్వలతో ప్రతీ ఇంటా సందడే. టపాసుల మోతలతో జిల్లా వ్యాప్తంగా ఒక్కరోజు ముందుగానే దీపావళి వచ్చేసింది. రైల్వేస్టేషన్ ఏరియా, పాతబీటు బజార్, నెహ్రూ పార్కు, సిద్దిపేట రోడ్డు ప్రాంతాలు వ్యాపారంతో కిటకిటలాడిపోయింది. పట్టణంలోని పలు ఫంక్షన్‌హాళ్లతో పాటు రైల్వేస్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలు జనంతో సందడిగా మారాయి. సోమవారం పండుగను పురస్కరించుకుని, తెల్లవారుజాము హారతులు, రాత్రి లక్ష్మీపూజలను నిర్వహించుకోనున్న నేపథ్యంలో దీపావళి బాంబులను ఒక్కరోజు ముందుగానే కొనుగోలు చేశారు.
జోరుగా వ్యాపారం..
జిల్లాలో ప్రతి ఏటా దీపావళి సీజన్‌న్‌లో రూ.125 కోట్లకుపైగా బాణసంచా వ్యాపారం జరుగుతుంది. ఇక్కడి నుంచి చుట్టుపక్కల జిల్లాలకు హోల్‌సేల్‌గా సరఫరా అవుతుంది. దీపావళి పండగను పురస్కరించుకుని పెద్ద ఎత్తున టపాసుల అమ్మకాలు జరుగుతున్నాయి. వస్త్ర, వ్యాపారం, కిరాణా సరుకులు, పూజా సామగ్రి, స్వీట్ల అమ్మకాలు పెరిగాయి.
అందాల ప్రమిదలు..
పల్లెలు, పట్టణాల్లో మట్టిప్రమిదలు వివిధ ఆకృతుల్లో ఆకట్టుకుంటున్నాయి. పంచలోహాలు, వెండి, మట్టితో తయారు చేసిన ప్రమిదల్లో దీపం వెలిగించడం శ్రేయస్కరంగా పండితులు చెబుతుంటారు. సూర్యాస్తమయం తర్వాత దీపం వెలిగించి, మహాలక్ష్మీ దేవీని స్మరించడం వల్ల కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. మట్టి ప్రమిదల అమ్మకాలు జోరుగా ఉన్నాయి.
బంతిపూలకు భలే గిరాకీ..
దీపావళి పండగ నేపథ్యంలో బంతిపూలకు గిరాకీ పెరిగింది. సుదూరు ప్రాంతాల నుంచి వచ్చిన వ్యా పారులు కిలో పూలను రూ.65కు విక్రయించారు. సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించుకోనున్న దీపావళి, లక్ష్మీపూజలు, కేదారీ వ్రతాల నోముల కోసం పూలను కొనుగోలు చేస్తున్నారు.
ప్రయాణికులతో కిటకిట
పండుగ కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చే కుటుంబాలతో జనగామ బస్టాండు కిటకిటలాడింది. ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా ఆర్టీసీ సంస్థల అదనపు బస్సులను నడిపించింది. ట్రాఫిక్ ఇబ్బందులు కలుగకుండా పోలీసులు పర్యవేక్షణ చేశారు.

కొత్త కాంతులు..

కొత్త కాంతులు..