
ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం!
జనగామ: జిల్లాలో ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధమైంది. ఇందుకు సంబంధించి అధికారుల పూర్తి స్థాయి నివేదికతో సమాయత్తమవుతున్నారు. విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా జూలై 15 నుంచి టీచర్ల సర్దుబాటు ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ నెల 25వ తేదీ లోపు సమగ్ర వివరాలతో జాబితాను అందించాలని అందులో పేర్కొన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో పలువురు పాత, కొత్త టీచర్లకు స్థాన చలనం కలిగే అవకాశం ఉంది. జిల్లాలో పీఎస్ 341, యూపీఎస్ 64, ఉన్నత పాఠశాలలు 103 ఉండగా, సుమారు 30వేల మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు.
నిబంధనల మేరకు..
ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం ప్రాథమిక పాఠశాలలో 10 మందిలోపు విద్యార్థులకు ఒకరు, 11 నుంచి 60 మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు తప్పనిసరిగా ఉండాలి. కానీ జిల్లాలోని పలు మండలాల్లో అందుకు విరుద్ధంగా 15 మంది విద్యార్థులకు ఒకే టీచర్ ఉండేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు ఉపాధ్యాయుల్లో చర్చ జరుగుతుంది. ఇందుకు సంబంధించి ఇతర స్కూల్స్‌కు వర్క్ అడ్జెస్ట్‌పై పంపించే ఉత్తర్వులు ఒకటి, రెండు రోజుల్లో వెలువడనున్నట్లు తెలుస్తుంది. వేసవి సెలవులకు ముందు.. బడులు ప్రారంభమైన తర్వాత చేపట్టిన బడిబాట కార్యక్రమంలో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా ప్రతీ టీచర్ కష్టపడ్డారు. దీంతో ఉపాధ్యాయుల నమ్మకంపై అనేక పాఠశాలల్లో ఊహించని విధంగా అడ్మిషన్లు పెరిగాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులకు విరుద్ధంగా, విద్యార్థుల సంఖ్యను పరిగణలోకి తీసుకోకుండా ఉపాధ్యాయులను మరో చోటకు వర్క్ అడ్జెస్ట్‌మెంట్ చేసేందుకు సిద్ధమవుతున్న క్రమంలో పిల్లల భవిష్యత్‌పై నీలినీడలు కమ్ముకునే పరిస్థితి ఎదురవుతుంది.
ఎంఈఓల సమీక్ష..
జిల్లాలోని ఆయా మండలాల పరిధిలో ఉపాధ్యాయుల సర్దుబాటుపై బుధవారం ఎంఈఓల సమక్షంలో సమీక్ష జరిగింది. 16 నుంచి 17 మంది విద్యార్థులు ఉన్న బడిలో ఇద్దరు టీచర్లు పనిచేస్తుండగా, నిబంధనలకు విరుద్ధంగా ఒకరిని మరోచోటకు పంపించనున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నిబంధనల మేరకు ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6, 7, 8, 9 తరగతులకు 1 నుంచి 20 మంది పిల్లలకు ఇద్దరు (ఒక ల్యాంగ్వేజ్, ఒక భాషేతర), 21 మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులుంటే నలుగురు ఉపాధ్యాయులు, ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10 వరకు 1–220 మంది పిల్లలకు ఏడుగురు ఉపాధ్యాయులు (సబ్జెక్టుకు ఒకరు) ఉండాలి. సర్కారు బడులకు వచ్చే పిల్లల భవిష్యత్ ఆగం కాకుండా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. లేదంటే ఆందోళన బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
జీఓకు విరుద్ధంగా
15 మందికి ఒకే టీచర్..?
బడిబాటలో పెరిగిన విద్యార్థుల పరిస్థితి ఏంటీ?

ఉపాధ్యాయుల సర్దుబాటుకు రంగం సిద్ధం!