
దివ్యాంగులకు అండగా భవిత కేంద్రాలు
● కలెక్టర్ రిజ్వాన్ బాషా
స్టేషన్‌ఘన్‌పూర్: దివ్యాంగ విద్యార్థులకు అండగా భవిత కేంద్రాలు ఉన్నాయని, సమాజంలో దివ్యాంగులు మనోస్థైర్యంతో ముందుకెళ్లాలనే యోచనతో భవిత కేంద్రాల్లో శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ రిజ్వాన్‌బాషా అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ జెడ్పీఎస్‌ఎస్ ప్రాంగణంలోని భవిత సెంటర్‌ను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని పిల్లలతో మాట్లాడారు. టీచర్లు బాగా నేర్పిస్తున్నారా, ఆడుకునేందుకు వస్తువులు ఇస్తున్నారా, నాణ్యమైన భోజనం అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగుల కోసం నిర్మాణం చేపడుతున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని భవిత కేంద్రాల్లో మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు నిధులు మంజూరు చేశామన్నారు. త్వరలోనే భవిత కేంద్రాల డిజిటలైజేషన్‌కు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, ఎంఈఓ కొమురయ్య, ఆర్‌అండ్‌బీ డీఈ సతీష్, జెడ్పీఎస్‌ఎస్ హెచ్‌ఎం సంపత్, రామతులసి, ప్రవీణ్, గిరి తదితరులు పాల్గొన్నారు.