
రిజర్వాయర్ నీరు విడుదల చేయాలని ధర్నా
జనగామ రూరల్: బొమ్మకూర్ రిజర్వాయర్ నుంచి కాల్వల ద్వారా నీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరుతూ శనివారం మండలంలోని శామీర్‌పేట వద్ద జనగామ నుంచి సిద్దిపేట జాతీయ రహదారి వద్ద రైతులు ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు అక్కడికి చేరుకొని అధికారులతో మాట్లాడి ధర్నా విరమింపజేశారు. అనంతరం మాజీ ఎంపీపీ మేకల కళింగరాజు, జిల్లా యువజన నాయకులు ఇరుగు సిద్ధులు మాట్లాడుతూ మే, జూన్, జూలై మాసాల్లో తగినంత వర్షం కురవక పోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయని, వరి నాట్లకు కూడా నీరు లేదన్నారు. బొమ్మకూర్ ఎడమ, కుడి కాల్వల నుంచి నీరు అందించే నార్లు పోసుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. తక్షణమే నీళ్లు వదలాలని, లేదంటే కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మాజీ జిల్లా అధ్యక్షుడు శానబోయిన మైపాల్, మాజీ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు దడిగ సందీప్, బైరగోని యాదగిరి, బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు తాళ్ల సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ బొల్లం శారద, ఎడమ ఐలయ్య, దడిగ సిద్ధులు, శంకర్, నరేష్, రవి, రైతులు పాల్గొన్నారు.
పంపులు ఆన్‌చేయండి:ఎమ్మెల్యే పల్లా
జనగామ: నియోజకవర్గంలో నారుమళ్లకు సాగు నీరు అందడం లేదని, తక్షణమే పంపులు ఆన్ చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి శనివారం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వానాకాలంలో సాగు చేసిన వరి, పత్తి, ఇతర పంటలను కాపాడాలంటే వందశాతం పంపులను ఆన్ చేయడమే షరణ్యమన్నారు. నార్లు, నాట్లు ఎండిపోయే దశలో ఉన్నాయని, కాపాడితేనే రైతులు చల్లంగా ఉంటారన్నారు. దేవాదుల నుంచి జనగామ నియోజకవర్గానికి సరిపడా సాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.
ఇరిగేషన్ అధికారులతో ఫోన్‌లో
మాట్లాడిన ఎమ్మెల్యే పల్లా

రిజర్వాయర్ నీరు విడుదల చేయాలని ధర్నా