
కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం
తరిగొప్పుల: కస్తూర్బా గాంధీ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని అదృశ్యమైంది. శుక్రవారం ఉదయం 9 గంటల సమయంలో అల్పాహారం చేసేందుకు పాఠశాల విద్యార్థులను సిబ్బంది పిలవగా ప్లేట్ తీసుకువస్తానని గదిలోకి వెళ్లిన విద్యార్థిని కనిపించకుండా పొయింది. సదరు విద్యార్థిని వద్ద మొబైల్ ఫోన్ దొరికిందని, అట్టి విషయాన్ని సిబ్బంది పాఠశాల ప్రత్యేక అధికారినికి దృష్టికి తీసుకువెళ్లారని, దీంతో భయబ్రాంతికి గురై పాఠశాల నుంచి పారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. పాఠశాల ప్రధాన ద్వారం మూసి ఉన్నప్పటికీ గదిలోని కిటికీ ఇనుప గ్రిల్స్ లేకపోడంతో దానిగుండ విద్యార్థిని పారిపోయినట్లు అనుమానం వ్యక్తం అవుతుంది. కాగా, ఇట్టి విషయమై పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఓ సునీత ఫిర్యాదు చేసినట్లు ఎస్సై శ్రీదేవి తెలిపారు.
సమస్యలు పరిష్కరించాలి
స్టేషన్‌ఘన్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయల సమస్యల పట్ల అనుసరిస్తున్న ఉదాసీనత వైఖరిని విడనాడి తక్షణమే పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మంగు జయప్రకాష్ డిమాండ్ చేశారు. ఘన్‌పూర్ డివిజన్ కేంద్రంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా విద్యారంగంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందాన ఉందన్నారు.
‘గులాబీ జెండా ఎగరాలి’
రఘునాథపల్లి: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపు నిచ్చారు. శుక్రవారం మండలకేంద్రంలో జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో గ్రామ గ్రామాన జరిగిన అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తోందని, 17 నెలల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి విస్మరించి ప్రజలను నిలువునా మోసం చేస్తుందన్నారు. వై కుమార్‌గౌడ్, ముసిపట్ల విజయ్, పెండ్లి మల్లారెడ్డి, మడ్లపల్లి సునీత, గైని శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆలయ అభివృద్ధికి సాయం
చిల్పూరు: కొండాపూర్ గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి దాత బంగారి రెడ్డి కుమారుడు పింగిళి యోగానందరెడ్డి రూ.2.40 లక్షల విరాళం అందజేశారు. కాగా, శుక్రవారం విరాళంతో ఆలయ కమిటీ ఆలయంలో రేకులషెడ్‌ను నిర్మించింది.
అభినందనీయం
దేవరుప్పుల: ప్రభుత్వ పాఠశాల అభ్యున్నతి కోసం పూర్వవిద్యార్థుల తోడ్పాటు అభినందనీయమని ఎంఈఓ జి.కళావతి అన్నారు. శుక్రవారం చిన్నమడూరు ఉన్నత పాఠశాలలో 1993–94 పదోవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో పాఠశాలకు బీరువా, పోడియం బహూకరించారు.
గోదావరి జలాలతో
చెరువులు నింపుతాం
బచ్చన్నపేట: గోదావరి జలాలతో చెరువులను, కుంటలను డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి చొరవతో నింపుతామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇజ్జగిరి రాములు అన్నారు. శుక్రవారం లక్ష్మాపూర్ గ్రామం వద్ద ఉన్న గోదావరి పైపులైన్ డెలివరీ పాయింట్ నుంచి బండనాగారం గ్రామ చెరువు, కుంటలకు వెళ్లే కాల్వకు మరమ్మతు పనులు చేయించారు. దేవస్థాన మాజీ చైర్మన్ చల్ల సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఇప్ప శ్రీధర్‌రెడ్డి, ప్రవీణ్ ఉన్నారు.
ఆస్పత్రి ఆవరణలోకి పాము
స్టేషన్‌ఘన్‌పూర్: స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోకి శుక్రవారం పాము రావడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు, వైద్య సిబ్బంది ఆందోళనకు గురైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఘన్‌పూర్ ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలోని శుక్రవారం ఓ పాము రావడంతో అక్కడ ఉన్న రోగులు గమనించి ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వెంటనే విషయాన్ని వైద్య సిబ్బందికి తెలుపగా వారు పాములు పట్టే స్నేక్ క్యాచర్ రమణాకర్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అతడు ఆసుపత్రికి చేరుకుని పామును పట్టుకోవడంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.

కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం

కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం

కేజీబీవీ విద్యార్థిని అదృశ్యం