
నేతన్నకు పొదుపు భరోసా
జనగామ: చేనేత రంగానికి ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు గత సర్కారు అమలు చేసిన థ్రిప్టు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ‘నేతన్న పొదుపు’ పథకంగా ముందుకు తెచ్చింది. 36 నెలల కాల పరిమితిని ప్రస్తుత ప్రభుత్వం 24 నెలలకు కుదించింది. నేత, అనుబంధ కార్మికులు చెల్లించే వాటాధనంలో సర్కారు రెండింతలు కలిపి జమచేస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తోంది. పథకం ద్వారా నేతన్న కుటుంబాల్లో పొదుపు అలవాటును ప్రోత్సహించడం సర్కారు ముఖ్యఉద్దేశం.
జిల్లాలో 2,824 మంది కార్మికులు
నేతన్న పొదుపు స్కీం ద్వారా జిల్లాలో 2,824 మంది నేత, అనుబంధ కార్మికులకు లబ్ధి చేకూరనుంది. జిల్లాలో 15వేల జియోట్యాగ్ మగ్గాలు, పవర్ లూమ్స్(మర మగ్గాలు) ఉన్నాయి. నేతన్న పొదుపు పథకానికి గతంలోనే కార్మికుల నుంచి సుమారు 3వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. చేనేత జౌళి శాఖ ప్రత్యేక అధికారుల బృందం అర్హత నిర్ధారణ కోసం ప్రతీ ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత థర్డ్ పార్టీ సర్వే చేపట్టారు. ఇందులో తప్పిన కార్మికుల వివరాలను జిల్లా అధికారులు నివేదిక రూపంలో ప్రభుత్వానికి పంపించారు. ఇదిలా ఉండగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నేత కార్మికులు నేతన్న పొదుపు పథకానికి దూరంగా ఉన్నారు. అధికారులు తనిఖీకి వెళ్లిన సమయంలో సుదూర ప్రాంతాలకు వెళ్లడం, శుభకార్యాల నేపథ్యంలో మగ్గాలు విప్పి అటెక్కించడంతో ప్రస్తుతం నేత వృత్తి చేయడం లేదని రికార్డులో ఎక్కించారు. తమ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ నేతన్న పొదుపులో అవకాశం కల్పించాలని కార్మికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
పథకం అమలు ఇలా..
నేత, అనుబంధ కార్మికులు ప్రతి నెలా తమ వేతనం నుంచి 8 శాతం కాంట్రిబ్యూషన్ చేస్తారు. ప్రభుత్వం కార్మికుల పొదుపునకు రెండింతలు(16శాతం) కలుపుకుని 24 నెలల తర్వాత వారి ఖాతాలో జమ చేస్తుంది. నేత కార్మికులు గరిష్టంగా రూ.1,200, అనుబంధ కార్మికులు రూ.800 వాటా ధనం చెల్లిస్తారు. మరమగ్గాల కార్మికులు 8 శాతం పొదుపు చేసుకోగా, ప్రభుత్వం అంతే మొత్తంలో భరోసా కల్పిస్తుంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 36 నెలల కాలపరిమితితో థ్రిఫ్టు పథకం అమలు చేయగా, సీఎం రేవంత్‌రెడ్డి దీనిని 24 నెలలకు కుదించి నేతన్న పొదుపు పథకంగా మార్చారు. నెలనెలా పొదుపు చేసుకునే సమయంలో ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ఆలస్యం జరిగితే.. నేత కార్మికులకు మూడు నెలల వెసులుబాటు కల్పించారు. అప్పటికీ పొదుపు జమ చేసుకోని పరిస్థితుల్లో సదరు కార్మికులు ఆ పథకం జాబితా నుంచి ఆటో మేటిక్‌గా తొలగిపోతారు.
జిల్లాలో నేతన్న పొదపు లబ్ధిదారుల వివరాలు
మండలం నేత స్కీం మొత్తం
కార్మికులు అర్హులు
జనగామ 683 683 1,366
బచ్చన్నపేట 359 330 689
నర్మెట 23 22 45
తరిగొప్పుల 17 15 32
స్టే.ఘన్‌పూర్ 11 11 22
చిల్పూరు 01 01 02
జాఫర్‌గడ్ 01 01 02
లిం.ఘనపురం 190 178 368
ర.నాథపల్లి 32 26 58
పాలకుర్తి 08 07 15
కొడకండ్ల 03 03 06
దేవరుప్పుల 137 82 219
మొత్తం 1,465 1,359 2,824
జిల్లాలో 2,824 మందికి లబ్ధి
స్కీం కాలపరిమితి 24 నెలలు
వీవర్ వాటా రూ.1,200
అనుబంధ కార్మికుడికి రూ.800
వాటాధనం చెల్లింపునకు మూడు నెలల వెసులుబాటు