
వచ్చే వారమే సీటీ స్కాన్ సేవలు
జనగామ: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(డీహెచ్)లో నూతనంగా ఏర్పాటు చేసిన సీటీ స్కాన్ సేవలను వచ్చే వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం ఆయన ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంతకు ముందు సీటీ స్కాన్ పని తీరుకు సంబంధించి డెమోను పరిశీలించారు. అనంతరం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ గోపాల్‌రావుతో కలిసి జనరల్ వార్డు, ఇతర విభాగాలను సందర్శించారు. ఫిజియో థెరపీ సేవలతో పాటు బ్లడ్ బ్యాంకు నిర్వహణ, అత్యవసర సమయంలో యూనిట్‌లను అందించేందుకు ఏ మేర సామర్థ్యం కలిగి ఉందనే దానిపై ఆరా తీశారు. భోజన వడ్డింపుపై రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయానుకూలంగా భోజనం వడ్డించాలని సిబ్బందికి సూచించారు. ఆస్పత్రిలో ఆపరేషన్లు, జనరల్ సేవలు, డాక్టర్ల పనితీరుపై రోగులతో మాట్లాడారు. సర్కారు ఆస్పత్రిని నమ్ముకుని వచ్చే నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి మరింత నమ్మకం కలిగించాలని కలెక్టర్ వైద్యులు, సిబ్బందికి సూచించారు. సమయ పాలన పాటించి రోగులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. కలెక్టర్ వెంట ఆర్‌ఎంఓ లక్ష్మీనారాయణ, డాక్టర్లు అనురాధ శంకర్, పద్మ, ప్రభ తదితరులు ఉన్నారు.
ముగిసిన కేంద్ర బృందం పరిశీలన
జనగామ రూరల్: జలశక్తి అభియాన్ కింద నేషనల్ వాటర్ అవార్డులో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనకు వచ్చిన కేంద్ర బృందం పర్యటన శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా బృందం సభ్యులు కలెక్టర్ రిజ్వాన్ బాషాతో సమావేశమయ్యారు. వారు మాట్లాడుతూ భూగర్భజల సంరక్షణకు చేపట్టిన పనులు, గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుందన్నారు. బతుకమ్మకుంట అభివృద్ధి కూడా భూగర్భ జలాల సంరక్షణకు చాలా ఉపయోగపడుతుందని చెప్పారు. అనంతరం ‘మన జిల్లా–మన నీరు’ కార్యక్రమం కింద తక్కువ ఖర్చుతో కలెక్టరెట్‌లో నిర్మించిన ఇంకుడు గుంతను కేంద్ర బృందం సభ్యులు పరిశీలించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా సభ్యులు అశ్వరావుపల్లి ఆర్‌ఎస్ రిజర్వాయర్, మీదికొండ చెక్‌డ్యాం, వెల్ది గ్రామంలో బోర్‌వెల్ రీచార్జ్ స్ట్రక్చర్, ఛాగల్లులో ఆయిల్‌పామ్ సాగు, నెల్లుట్లలో ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ ప్లాంటేషన్ నర్సరీ, రఘునాథపల్లిలో ఫీజో ఎలక్ట్రిక్ మీటర్, పాలకుర్తిలో ఫామ్ పాండ్స్, వాటర్ ట్యాంకు, పైపులైన్ నిర్మా ణాలు, కంపోస్ట్ షెడ్డు, జనగామలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్, డీఆర్‌డీఓ వసంత తదితరులు పాల్గొన్నారు.
వైద్యులు సమయపాలన పాటించాలి
డీహెచ్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ రిజ్వాన్ బాషా

వచ్చే వారమే సీటీ స్కాన్ సేవలు