‘రైతు నేస్తం’కు సర్వం సిద్ధం
జనగామ: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం అమలు చేస్తున్న పథకాలు, సాగు, దిగుబడి తదితర వాటికి సంబంధించి రైతు నేస్తం కార్యక్రమం ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి నేడు (సోమవారం) రైతులతో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇందుకు సంబంధించి కలెక్టర్ రిజ్వాన్ బాషా నేతృత్వంలో జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియం నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాల రైతులతో సీఎం ఇంటరాక్టు కానున్నారు. రైతు వేదిక ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు ఈ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభం కానుంది. గతంలో 12 రైతుల వేదికల్లో 12 దృశ్య శ్రవణం అందుబాటులో ఉండగా, నేటి నుంచి మరో 24 వేదికల్లో నూతనంగా ప్రారంభించ బోతున్నారు. మొత్తంగా 36 రైతు వేదికల ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. జనగామ మండలం చీటకోడూరు రైతువేదికలో కలెక్టర్ రిజ్వాన్ బాషా పాల్గొననున్నారు. సీఎం రైతు నేస్తం ప్రోగ్రాంలో మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలు, ఏడీఏలు, ఏఓలు, ఏఈఓ హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు.
పండుగ వాతావరణంలో...
సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ప్రోత్సాహంగా అందిస్తున్న కార్యక్రమాలపై ముఖాముఖి ఉంటుందని తెలుస్తుంది. రైతు భరోసా, పంట రుణమాఫీ, ఆయిల్ ఫామ్ సాగు ప్రోత్సాహం, ధాన్యం కొనుగోళ్లు తదితర వాటికి సంబంధించి సీఎం నేరుగా రైతు నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని సమాచారం. రైతు వేదికలను మామిడి తోరణాలతో అలంకరించి, రంగ వళ్లులతో రైతులను స్వాగతించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యధికంగా మహిళా రైతులను భాగస్వామ్యులను చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా తాగునీరు, తదితర సౌకర్యాలను కల్పిస్తున్నారు. అయితే సీఎం రైతులను అడిగే సమయంలో వారు చెప్పే సమాధానాలు ఎలా ఉండబోతున్నాయనే టెన్షన్ నెలకొంది.
నేడు రైతులతో మాట్లాడనున్న సీఎం
36 రైతువేదికల్లో ఏర్పాట్లు పూర్తి


