రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..
స్టేషన్‌ఘన్‌పూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల ముందు రైతులకు చేసిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో హామీలు అమలు చేయాలని గురువారం ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా జిల్లా అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా రైతులకు రుణ విముక్తి చేయాలని, రుణ విమోచన చట్టం తేవాలని కోరారు. విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ ప్రైవేటు మార్కెట్ల ముసాయిదాను వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రైతులకు చేసిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం మండల కార్యదర్శి లింగనబోయిన కుమారస్వామి, నాయకులు మొగిలి, రాజు, మల్లయ్య, సోమయ్య, లింగయ్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.


