
ఉద్యమకారుల సమస్యలు పరిష్కరిస్తాం
● ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్
పాలకుర్తి టౌన్: తెలంగాణ ఉద్యమకారుల సమస్యలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఎమ్మెల్సీ, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీఖాన్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆవేదన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారన్నారు. అనంతరం తెలంగాణ క్రాంతి దల్ రాష్ట్ర అధ్యక్షుడు పృధ్వీరాజ్ యాదవ్ మాట్లాడుతూ ఉద్యమకారుల డిమాండ్లను నెరవేర్చకుంటే అసెంబ్లీ ముట్టడిస్తామన్నారు. ఉద్యమకారులకు న్యాయం చేయడంలో కోదండరామ్ ముందుండాలని, లేదంటే రాజీనామా చేయాలని తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ విఠల్ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో లాఠీలకు తూటాలకు ఎదురొడ్డి పోరాడింది, ప్రాణ త్యాగాలు చేసిన ఉద్యమకారులకు గుర్తింపు దక్కలేదని ఓయూ జేఏసీ కార్యదర్శి జనరల్ తుమ్మల ప్రపుల్‌రామ్‌రెడ్డి అన్నారు. ఇప్పటికై న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమారస్వామి, డాక్టర్ మాచర్ల భిక్షపతి, తెలంగాణ జర్నలిస్టు ఫ్రంట్ అధ్యక్షుడు మోహన్ బైరాగి, కంచర్ల బద్రి, కృష్ణలత, గుమ్మడిరాజుల సాంబయ్య, పోలస సోమయ్య, మూల ప్రభాకర్, సింగ మహేందర్‌రాజు, పుల్లిగిల్ల యాకయ్య, సింగరపు దీపక్ తదితరులు పాల్గొన్నారు.
మైనార్టీల అభివృద్ధే లక్ష్యం
జనగామ రూరల్: మైనార్టీల అభివృద్ధే లక్ష్యమని ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్ అన్నారు. పాలకుర్తి పర్యటన నేపథ్యంలో ఆదివారం పట్టణంలోని న్యాయవాది జమాల్ షరీఫ్ ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో దశలవారీగా లక్ష మంది మైనార్టీ యువకులకు ఆర్థికంగా చేయూతఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎమ్మెల్సీ తెలిపారు. అలాగే జనగామ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం సీనియర్ నాయకులు, ముస్లిం పెద్దలు ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు.