
వెరిఫికేషన్ వేగంగా పూర్తి చేయాలి
● కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
జనగామ రూరల్: ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక పరిశీలన వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్‌తో కలిసి అన్ని మండలాల స్పెషల్ అధికారులు మున్సిపల్ కమిషనర్లు, హౌసింగ్ పీడీ, బీసీ, ఎస్సీ సంక్షేమ అధికారులు, ఎస్సీ కార్పొరేషన్, ఎల్‌డీఎం, ఎంపీడీఓలతో జూమ్ మీటింగ్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంత మందిని అర్హులుగా గుర్తించ్చారో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
ఆధునిక పద్ధతులను పాటించాలి
రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంచి గుణాత్మక, ఆధునిక విద్యనందించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభు త్వ, ఆదర్శ, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్ కొడకండ్ల, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులకు క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో ఐదు రోజులపాటు నిర్వహించే జిల్లా స్థాయి వృత్యంతర శిక్షణ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠ్యంశాల బోధనలో విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఈ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని తెలిపారు. శిక్షణ మెలుకువలను పాఠశాల స్థాయికి తీసుకెళ్లి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలన్నారు. పుస్తక పరిజ్ఞానంతో పాటు అధునాతన టెక్నాలజీకి తగ్గట్టు విద్యార్థుల మేథాశక్తిని పెంపొందించాలన్నారు. కార్యక్రమంలో డీఈఓ భోజన్న, ఏఎంఓ శ్రీనివాస్ కోర్సు ఇంచార్జ్‌లు మల్లికార్జున్, యాదగిరి, ఆనంద్ బాబు పాల్గొన్నారు. అక్షరాస్యతలో అంతరాన్ని తగ్గించి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరెట్‌లో అక్షరాస్యతా కార్యక్రమం మీద తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖల సంయుక్త సమావేశం నిర్వహించారు. చదువు రాని, మధ్యలో బడి మానేసిన వారి వివరాల సర్వే 19వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రైనర్ నాగరాజు, మండల విద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.