
‘ఆపరేషన్ సిందూర్’కు సంపూర్ణ మద్దతు
జనగామ రూరల్: ఉగ్రవాదం నుంచి దేశానికి శాశ్వతంగా విముక్తి జరగాలి.. అలాగే ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను స్వాగతిస్తూ సంపూర్ణ మద్దతను తెలియజేస్తున్నామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన పార్టీ జనగామ పట్టణ 4వ మహాసభల్లో ఆయన మాట్లాడారు. ఉగ్రవాదానికి కులం, మతం, దేశం అనే బేధం లేదని, పాకిస్థాన్ పాలకులు, ఉగ్రవాదులు ఒకరిపై ఒకరు ఆధారపడి భారత్‌లో నరమేధాన్ని సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌ను ఆసరాగా చేసుకుని ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంద ని, దానికి సరైన గుణపాఠం చెప్పాలిందేనన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. అలాగే ఈదేశ పౌరులైన మావోయిస్టులను ఏరివేసేందకు ఆపరేషన్ కగార్ చేపట్టడం సరైంది కాదని, తక్షణమే దీనిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులతో చర్చలకు ఒప్పుకునేదిలేదని కేంద్ర మంత్రి నియంతలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సీహెచ్.రాజారెడ్డి, పాతూరి సుగుణమ్మ, జిల్లా సహాయ కార్యదర్శులు ఆది సాయన్న, ఆకుల శ్రీనివాస్, నాయకులు చొప్పరి సోమయ్య, మోతె శ్రీశైలం, చామకుర యాకూబ్, కెమిడి మల్లయ్య, గుగులోత్ సఖి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు