
సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పాలకుర్తి టౌన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రంలోని బృందావన్ గార్డెన్‌లో డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన పార్టీ సంస్థాగత నిర్మాణ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, ఆమార్ ఆలీఖాన్, ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జ్ హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి ఎంపీ కావ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయలేదన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతీకార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి మాట్లాడుతూ పాలకుర్తిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందంజలో ఉంచుతామన్నారు. కార్యకర్తలు పాత, కొత్త తేడా లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో జనగామ, వరంగల్, మహబూబాబాద జిల్లా అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ, భరత్‌చందర్‌రెడ్డి, అనుమాండ్ల ఝాన్సీరెడ్డి, రవళిరెడ్డి, బైకిని లింగం యాదవ్, పోట్ల నాగేశ్వర్‌రావు, మేడి రవిచంద్ర, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
యూత్ కాంగ్రెస్ నాయకుల వాగ్వాదం
కాగా ఈ సన్నాహక సమావేశానికి దేవరుప్పులకు చెందిన కాంగ్రెస్ పార్టీ యూత్ విభాగం ఉపాధ్యక్షుడు ఉప్పుల సాయిప్రకాశ్ తన అనుచరులతో కలిసి వెళ్లగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే టీపీసీసీ సభ్యుడు, డాక్టర్స్ సెల్ జనగామ జిల్లా కన్వీనర్ లక్ష్మీనారాయణనాయక్‌ను వేదికపైకి పిలవకపోవడంతో ఆయన కొంతసేపు చూసి అక్కడినుంచి వెళ్లిపోయారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో
కాంగ్రెస్ జెండా ఎగరాలి
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య