సివిల్‌ సప్లయీస్‌కు ‘సీఎంఆర్‌‘ చిక్కులు | - | Sakshi
Sakshi News home page

సివిల్‌ సప్లయీస్‌కు ‘సీఎంఆర్‌‘ చిక్కులు

May 3 2025 7:42 AM | Updated on May 3 2025 7:42 AM

సివిల్‌ సప్లయీస్‌కు ‘సీఎంఆర్‌‘ చిక్కులు

సివిల్‌ సప్లయీస్‌కు ‘సీఎంఆర్‌‘ చిక్కులు

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

● హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఓ రైసుమిల్లుకు 2021–22, 2022–23 సంవత్సరాలకు కేటాయించిన సీఎంఆర్‌ కింద 4,310 మె.టన్నుల బియ్యానికి 1,889 మె.టన్నులు మాత్రమే సరఫరా చేశారు. సుమారు రూ.7.50 కోట్ల విలువైన బియ్యం ఎగవేయడంతో అప్పట్లో సివిల్‌ సప్లయీస్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి బియ్యం లేకపోవడంతో కేసులు నమోదు చేసి డిఫాల్టర్‌ లిస్టులో చేర్చారు.

● మహబూబాబాద్‌ జిల్లాలోని మూడు మిల్లుల్లో గత సీజన్‌లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. అదే విధంగా కేసముద్రం విలేజ్‌ గ్రామంలోని రైస్‌ మిల్లుల్లో సివిల్‌ సప్లయ్‌, విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించి కేసులు పెట్టారు.

ఉమ్మడి జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. రైతులనుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) కింద రైసుమిల్లర్లకు సరఫరా చేయాల్సి ఉండగా.. ఈసారి డిఫాల్టర్‌లకు ఇవ్వొద్దని ప్రభుత్వంనుంచి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. 20 శాతం మిల్లర్లు ఈ జాబితాలో ఉండే అవకాశం ఉంది. సివిల్‌ సప్లయీస్‌ అధికారులు వాటిపై పునరాలోచన చేస్తూ మిగతా మిల్లర్లకు ధాన్యం ఇస్తున్నారు.

ధాన్యం దిగుబడుల అంచనాలకు అనుగుణంగా ఉమ్మడి వరంగల్‌లో 987 కొనుగోలు కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జేఎస్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పాక్షికంగా సాగుతుండగా.. మిగతా జిల్లాల్లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ధాన్యం అమ్ముకుంటున్న రైతులకు ఆన్‌లైన్‌ ప్రొక్యూర్‌మెంట్‌ మెనేజ్‌మెంట్‌ సిస్టం (ఓపీఎంఎస్‌) ద్వారా డబ్బు బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తున్నారు.

దాడులు, కేసులు పెట్టినా అదే మొండివైఖరి...

సీఎంఆర్‌ కింద ఇచ్చిన ధాన్యాన్ని పలు జిల్లాల్లో కొందరు రైస్‌ మిల్లర్లు పక్కదారి పట్టించారు. రాష్ట్రవ్యాప్తంగా పౌరసరఫరాలశాఖ టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మూకుమ్మడి తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేశారు. గత రబీ సీజన్‌లో సీఎంఆర్‌ కోసం కూడా హనుమకొండ, వరంగల్‌, జేఎస్‌ భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్‌ జిల్లాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మహబూబాబాద్‌ జిల్లాలోని మూడు మిల్లుల్లో రూ.30.38 కోట్ల విలువైన 1,13,796 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించినట్లు తేలింది. వరంగల్‌ జిల్లాలోని ఓ మిల్లులో రూ.3.79 కోట్ల విలువైన 12,360 క్వింటాళ్లు పక్కదారి పట్టినట్లు గుర్తించి కేసు పెట్టారు. మొత్తంగా ఉమ్మడి వరంగల్‌లో జరిపిన తనిఖీల్లో ఆరేడు సంవత్సరాలకు సంబంధించిన రూ.201 కోట్లకు పైగా విలువైన బియ్యం బకాయి ఉన్నట్లు వెల్లడించారు. కాగా ఇప్పటికే డిఫాల్టర్‌ జాబితాలో ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశామని, 6ఏ కేసులు కూడా నమోదు చేశామని, అవసరమైతే రెవెన్యూ రికవరీ యాక్టు కూడ పెడతామని పౌరసరఫరాలశాఖ అధికారులు చెబుతున్నారు.

రబీ సీజన్‌ సీఎంఆర్‌ ఆచితూచి..

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బాయిల్డ్‌, రా రాస్‌ మిల్లులు 328 వరకు ఉన్నాయి. వరంగల్‌, హనుమకొండ, మహబూబాబాద్‌, ములుగు, జనగామ, భూపాలపల్లి జిల్లాలోని మిల్లుల నుంచి బకాయిలు సుమారు లక్షా 20వేల మెట్రిక్‌ టన్నుల పైచిలుకు రావాల్సి ఉందని ఫైనల్‌గా తేల్చారు. సీఎంఆర్‌ బకాయి ఉన్న డిఫాల్టర్‌లకు ఈ సీజన్‌లో ధాన్యం ఇవ్వరాదన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ సీజన్‌ 10.24 లక్షల మె.టన్నుల మేరకు ధాన్యం దిగుబడి ఉంటుందని అంచనా వేసిన అధికారులు 987 కొనుగోలు కేంద్రాల కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఇన్‌టైమ్‌లో సీఎంఆర్‌ ఇచ్చిన మిల్లర్లకే సరఫరా చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. డిఫాల్టర్‌గా ఉన్న రైసుమిల్లర్లకు కేటాయించే ధాన్యాన్ని సకాలంలో సీఎంఆర్‌ ఇచ్చిన మిలర్లకు తరలించడమా... లేక ఈ సీఎంఆర్‌ బకాయి రాబట్టుకుని అదనంగా జమానత్‌లు తీసుకుని వారికే ఇవ్వడమా... అన్న కోణంలో కసరత్తు చేస్తున్నారు.

పెండింగ్‌లో గత రబీ,

ఖరీఫ్‌ సీఎంఆర్‌ బియ్యం

లక్ష్యానికి దూరంగా

చాలామంది రైసుమిల్లర్లు

గడువు పెంచినా

కదలని సీఎంఆర్‌ బకాయి

ఊపందుకున్న రబీ ధాన్యం కొనుగోళ్లు

డిఫాల్టర్‌లకు సీఎంఆర్‌ ఇవ్వద్దని సర్కారు ఆదేశం..

‘ప్రత్యామ్నాయం’పై కసరత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement